
పూరీ క్షేత్రంలోని జగన్నాథ దేవాలయం చుట్టూ చేపట్టిన భారీ పెరిఫెరల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ శ్రీ మందిర్ పరిక్రమ ప్రకల్పను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బుధవారం ఆవిష్కరించారు. నవీన్ పట్నాయక్ సర్కారు రూ.800కోట్లతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. గజపతి మహారాజు పూరీ దిబ్యాసింగ్ దేవ్, 90 పుణ్యక్షేత్రాల ప్రతినిధులు, భక్తుల సమక్షంలో శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్ప ప్రాజెక్టును నవీన్ పట్నాయక్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్నాథుడి ఆశీస్సులతోనే ఈ పాజెక్టు పూర్తయ్యిందని తెలిపారు. ప్రాజెక్టులో భాగంగా ఆలయానికి వచ్చే భక్తుల వాహనాల కోసం పార్కింగ్, భక్తులు వచ్చిపోయేందుకు శ్రీమార్గ్ పేరుతో రోడ్డు నిర్మాణం, సామాగ్రి భద్రపరచుకునేందుకు క్లాక్ రూములు సహా పూరీ ఆలయం లోపల, చుట్ట పక్కల అనేక వసతులు కల్పించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో పూరీ నగరాన్ని అందంగా తీర్చిదిద్దారు.
రంగురంగుల పూలు, విద్యుత్తు దీపాలు, గ్రాఫిటీ చిత్రకళతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా మహా యజ్ఞం మకర సంక్రాంతి రోజున ప్రారంభించగా బుధవారం మధ్యాహ్నం గజపతి మహారాజు దిబ్యాసింగ్ దేవ్ నిర్వహించిన పూర్ణాహుతితో పరిసమాప్తమైంది. ఆ తర్వాత సీఎం నవీన్ పట్నాయక్ ప్రాజెక్టును ప్రారంభించి జగన్నాథుడి భక్తులకు అంకితమిచ్చారు. 2019లో ఒడిశాలోని పూరీ నగరంలో వరదలు సంభవించాయి. ఆ తర్వాత 12వ శతాబ్దానికి చెందిన ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు నవీన్ పట్నాయక్‌కు సర్కారు సంకల్పించింది.
ఇక్కడికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని శ్రీ మందిర్ పరిక్రమ ప్రకల్ప ప్రాజెక్టును తలపెట్టారు. రూ.800కోట్లతో జగన్నాథ ఆలయంలోని మేఘనాథ్ పచేరి చుట్టూ భారీ కారిడార్‌ను నిర్మించారు. ఇది ఆలయాన్ని వ్యవస్థీకృత పద్ధతిలో సందర్శించడానికి భక్తులకు సహాయపడనున్నది.
దాంతో పాటు పార్కింగ్ ప్రాంతాలు, కొత్తగా వంతెన, యాత్రికుల రాకపోకలకు వీలుగా రోడ్డు, మరుగుదొడ్లు, జగన్నాథ దేవాలయం చుట్టూ భక్తుల కోసం క్లాక్‌రూమ్‌లు తదితర సౌకర్యాలన్నీ సమకూర్చారు.బహుశా స్వాతంత్య్రం తర్వాత పూరి దేవాలయం పరిసరాలను పెద్ద ఎత్తున ఆధునీకరించడం ఇదే మొదటిసారని చెప్పవచ్చు. దేవాలయం లోపలి ప్రదేశాన్ని పురావస్తు శాఖ 1974 నుండి పర్యవేక్షిస్తుంది.
More Stories
రామ జన్మభూమిలో తొలి `కరసేవక్’ కామేశ్వర చౌపాల్ మృతి
ప్రయాగ్రాజ్ మహాకుంభ్ నుండి సనాతన- బౌద్ధ ఐక్యత సందేశం
చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా