తెలంగాణాలో రూ. 37,600 కోట్ల పెట్టుబడికి 6 కంపెనీల సంసిద్ధత

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్‌ పర్యటన సందర్భంగా బుధవారం పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకొన్నాయి. అ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అదానీ గ్రూప్‌సహా ఆరు కంపెనీలు మొత్తం రూ.37,600 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి.

అదానీ గ్రూప్‌ రాష్ట్రంలో వివిధ రంగాల్లో రూ.12,400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ తెలంగాణలో రూ.9,000 కోట్ల పెట్టుబడితో 1,500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంగల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఆ సంస్థ ఈ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. సీఎం రేవంత్‌తో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ సమావేశమైన అనంతరం ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు.

తెలంగాణలో ఔషధాల ఆవిషరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ సంసిద్ధత వ్యక్తంచేసింది. ఇందులో భాగంగా రూ.2,000 కోట్ల కొత్త పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొన్నది.

గోడి ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ తెలంగాణలో రూ.8,000 కోట్ల పెట్టుబడితో ఆర్‌ అండ్‌ డీతోపాటు గిగా సేల్‌ బ్యాటరీ సెల్‌ తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది. సీఎం రేవంత్‌తో గోడి ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మహేష్‌ గోడి సమావేశమయ్యారు.

తెలంగాణలో రూ.5,200 కోట్లతో డాటా సెంటర్లను నెలకొల్పేందుకు వెబ్‌వర్స్‌ ముందుకొచ్చింది. డాటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్‌ మౌంటేన్‌ అనుబంధ సంస్థ వెబ్‌వర్స్‌. ఐ రన్‌ మౌంటేన్‌ సీఈవో విలియం మీనీ, వెబ్‌వర్స్‌ సీఈవో నిఖిల్‌ రాఠీ.. సీఎం రేవంత్‌ తో సమావేశమై తెలంగాణలో డాటా సెంట ర్ల ఏర్పాటు, నిర్వహణపై చర్చలు జరిపారు.

సీఎం రేవంత్‌రెడ్డితో గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ నాదిర్‌ గోద్రె జ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో రూ.1,000 కోట్లతో కెమికల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

భారత పరిశ్రమల సమాఖ్య తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో బుధవారం పలు కంపెనీలకు చెందిన సీఈవోలు దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబులతో భేటీ అయ్యారు.  రాష్ర్టాభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని సీఎంకు భరోసా ఇచ్చారు. సీఐఐ చైర్మన్‌ శేఖర్‌రెడ్డితోపాటు వివిధ కంపెనీల సీఈవోలు సీఎంను కలిసినవారిలో ఉన్నారు.