అనర్హతపై స్పీకర్‌, ఉద్ధవ్‌ వర్గం ఎమ్మెల్యేలకు నోటీసు

మహారాష్ట్ర స్పీకర్‌ రాహుల్‌ నార్వేకర్‌, ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి బాంబే హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఉద్ధవ్‌ వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్‌ అనర్హత వేటు వేయకుండా నిర్ణయం తీసుకోవడాన్ని ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన బాంబే హైకోర్టులో ప్రశ్నించింది. 

న్యాయమూర్తులు గిరీష్‌ కులకర్ణి, ఫిర్దోష్‌ పూనివాలాలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మహారాష్ట్ర సెక్రటేరియట్‌కు నోటీసులు జారీ చేసింది. అలాగే ఉద్ధవ్‌ ఎమ్మెల్యేలందరూ కౌంటర్‌ అఫిడవిట్‌లను దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది.

షిండే నేతృత్వంలోని  శివసేన చీఫ్‌ విప్‌ భరత్‌షెట్‌  గోగావాలే ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.  జనవరి 12న శివసేన ఇరు వర్గాల అనర్హత పిటిషన్లను స్పీకర్‌ తిరస్కరించడంతో పాటు  షిండే వర్గమే అసలైన శివసేనగా   స్పీకర్   ప్రకటించారు.   

ఉద్ధవ్‌ థాకరే వర్గం ఎమ్మెల్యేలపై ఎందుకు అనర్హత వేటు వేయలేదని  పిటిషన్‌లో ప్రశ్నించారు. స్పీకర్‌ ఉత్తరువు చట్టపరంగా  లోపభూయిష్టంగా ఉందని పేర్కొన్నారు.  స్పీకర్‌ తీర్పును రద్దు చేయాలని ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలను  అనర్హులుగా ప్రకటించాలని బాంబే హైకోర్టును కోరారు.   

అయితే షిండే వర్గమే అసలైన శివసేనగా ప్రకటించిన స్పీకర్‌ తీర్పును సవాల్‌ చేస్తూ ఉద్ధవ్‌ థాకరే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.