లేపాక్షిలో ప్రధాని మోదీ రామ భజన

ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలోని సత్యసాయి జిల్లాలో ఉన్న లేపాక్షి ఆలయాన్ని , శిల్పకళా సంపదను మంగళవారం సందర్శించారు. ఆలయంలో లేపాక్షి వీరభద్ర ఆలయం చుట్టూ తిరిగి ఆలయ విశిష్టతను, స్థలపురాణాన్ని అడిగి తెలుసుకున్నారు.  మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి ప్రముఖ క్షేత్రం లేపాక్షి వెళ్లారు.
అక్కడ వీరభద్ర స్వామి ఆలయాన్ని  సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశిష్టతలను అర్చకులు ప్రధానికి వివరించారు. మూలవిరాట్టుకు హారతి ఇచ్చారు. దర్శనానంతరం మోదీకి ఆలయ అర్చకులు వేదాశ్వీరచనాలు పలికారు. స్వామివారి శేషవస్త్రాన్ని బహూకరించారు. తీర్థప్రసాదాలను అందజేశారు.
సుమారుగా 40 నిమిషాల పాటు మోదీ ఆలయ ప్రాంగణంలోనే గడిపారు.
ఆలయంలో నిర్వహించిన ‘శ్రీరామ జయ రామ’ భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. భజన కీర్తలను ఆలపిస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. లేపాక్షి ఆలయ చరిత్ర, దీనికి ఉన్న విశిష్ఠత గురించి అధికారులు మోదీకి వివరించారు. ఏకరాతితో నిర్మించిన మహాశివుడి విగ్రహం, ఆలయ ప్రాంగణంలో ఉన్న వేలాడే రాతి స్తంభం, ఆలయ ప్రాశస్త్యం, శిల్పకళ సంపద, దేవాలయ నిర్మాణం తదితర వివరాలను తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఆలయం పురావస్తు శాఖ ఆధీనంలో కొనసాగుతోంది.
 
పుట్టపర్తి జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని సుమారు రూ. 541 కోట్ల వ్యయంతో జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ(నాసిన్‌)ను ప్రధాని ప్రారంభించేందుకు ఏపీ పర్యటనకు వచ్చారు. ప్రధాని పర్యటలో ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. పీఎం పర్యట సందర్భంగా జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.