రామరాజ్యం అందించేందుకు కేంద్రం కృషి

కేంద్ర ప్రభుత్వం రామరాజ్యం పాలనను అందించే విధంగా పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. విధి నిర్వహణలో అధికారులు రాముడి పాలనను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో నెలకొల్పిన జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ(నాసిన్‌)ని ప్రధాని  ప్రారంభిస్తూ  రానున్న రోజుల్లో నాసిన్‌ కేంద్రం ప్రముఖ శిక్షణా సంస్థగా మారుతుందని. సుపరిపాలనకు సరికొత్త కేంద్రంగా రూపుదిద్దుకోబోతుందని స్పష్టం చేశారు.
 
రామరాజ్యంలో పన్నుల వ్యవస్థ ఎంతో సరళంగా ఉండేదని చెబుతూ  పరిపాలన దక్షతకు శ్రీరాముడు మారుపేరని ప్రధాని ప్రశంసించారు. శ్రీరాముడు దేశ ప్రజలందరికీ ప్రేరణ అని పేర్కొంటూ అక్రమంగా వచ్చే అధికారిన్ని స్వీకరించొద్దని రాముడు చెప్పావారని, ఆధర్మ మార్గంలో వచ్చేది ఇంద్రప్రస్తామైన తనకు అక్కరలేదని రాముడు చెప్పారని గుర్తు చేశారు.
 
‘‘ రామరాజ్యం మనందరికీ ఆదర్శప్రాయం. రామరాజ్యం గురించి మహాత్మాగాంధీ అనేక సార్లు ప్రస్తావించారు. ప్రజలకు సుపరిపాలన అందాలని గాంధీ చెప్పారు’’ అని ప్రధాని తెలిపారు. ఎల్లప్పుడూ ధర్మ పక్షానే నిలుస్తానని రాముడు చెప్పారని ప్రధాని తెలిపారు. 
 
 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత పన్నులను సరళీకృతం చేయడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు సుమారు లక్షల కోట్ల రూపాయలు లాభం జరిగిందని ప్రధాని వివరించారు. తాము తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల ఆదాయపన్ను చెల్లింపు విధానం సులభతరం చేయడంతో పన్నులు చెల్లించే వారి సంఖ్య నానాటికి పెరుగుతుందని పేర్కొన్నారు. 

పదేళ్లుగా దేశంలో పేదరికం క్రమంగా తగ్గుతుందని, అనేక కార్యక్రమాల వల్ల మధ్యతరగతి వర్గాల ఆదాయం పెరుగుతుందని మోదీ చెప్పారు. జీఎస్టీ రూపంలో ఆధునిక పన్నుల వ్యవస్థ తెచ్చామని వివరించారు. పన్నుల వ్యవస్థ కూడా సరళంగా ఉండాలని, వచ్చే పన్నులతో దేశంలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

పేదలు, రైతులు, మహిళలు,యువకుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మోదీ ఉద్ఘాటించారు. పేదలకు ప్రభుత్వాలు సహకారమందిస్తే పేదరికం దూరమవుతుందని చెబుతూ 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని ప్రధాని వెల్లడించారు.  పథకాలు కాగితాలపై కాదని, క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయని తెలిపారు.

తమ ప్రభుత్వ పధకాలు కాగితాలపై కాదని, క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయని ప్రధాని స్పష్టం చేశారు. పేదల జీవితాలు బాగుపడ్డాయనే విషయం నీతి ఆయోగ్‌ చెప్పిందని, వివిధ ఉపాధి అవకాశాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపామని నరేంద్ర మోదీ తెలిపారు. 

నాసిన్ దేశంలోనే అత్యున్నతమైన శిక్షణా సంస్థ అవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రెవెన్యూ సర్వీసులకు ఎంపికైన వారికి నాసిన్‌లో శిక్షణ ఇస్తామని, ప్రపంచ కస్టమ్స్ సంస్థ కూడా నాసిన్‌కు గుర్తింపు ఇచ్చిందని, నాసిన్ అతి త్వరలో అంతర్జాతీయ శిక్షణా కేంద్రంగా మారనుందని చెప్పారు. నాసిన్ ఏర్పాటుకు ఎపి ప్రభుత్వం 500 ఎకరాలు ఇచ్చిందని చెబుతూ కేంద్రీయ విద్యాలయం, తాగునీటికి తగిన ఏర్పాటు చేశారని ఆమె ప్రశంసించారు.

ఈ కార్యక్రమంల ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. పాలసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారికి ఆనుకుని 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ శిక్షణ కేంద్రాన్ని నిర్మించారు. ఐఏఎస్‌లకు ముస్సోరి, ఐపీఎస్‌లకు హైదరాబాద్‌ తరహాలో ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌ (ఐఆర్‌ఎస్‌)కు ఎంపికైనవారికి ఇక్కడ శిక్షణ ఇస్తారు. నాసిన్‌ కోసం ప్రత్యేక రైల్వేలైన్‌ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.