చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై `సుప్రీం’లో భిన్నాభిప్రాయాలు

తనపై నమోదైన స్కిల్ స్కామ్ కేసును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటీషన్ పై ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.  జడ్జిలు అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. భిన్న తీర్పులు వెలువరించినందున ఈ కేసును త్రిసభ్య ధర్మాసనానికి రిఫెర్ చేయాలని ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. 
 
17-ఏ వర్తింపు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండడంతో తగిన నివేదిక కోసం చీఫ్ జస్టిస్‌కి నివేదిస్తున్నామని జస్టిస్ బేలా త్రివేది వెల్లడించారు. చంద్రబాబుకు 17 ఏ వర్తిస్తుందని జస్టిస్ బోస్ చెప్పగా, వర్తించందని జస్టిస్ త్రివేది పేర్కొన్నారు. ఫలితంగా ఈ కేసులో భిన్నాభిప్రాయాలు వచ్చినట్లు అయింది. దానితో తుది తీర్పు కోసం ఈ కేసు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కు బదిలీ కానుంది.
 
చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అన్న దానిపై డివిజన్ బెంచ్ ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. స్కిల్ కేసులో తనపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, అరెస్టు, రిమాండ్‌కు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని వాదిస్తూ గతంలో ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు.
 
హైకోర్టు తోసిపుచ్చడంతో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తించదని సుప్రీంకోర్టు బెంచ్‌లో జస్టిస్ బేలా త్రివేదీ తీర్పులో తెలిపారు. 2018 తర్వాత జరిగిన నేరాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పారు. అలాగే ట్రయల్ కోర్టు (విజయవాడ ఏసీబీ కోర్టు) నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని కూడా తెలిపారు.
 
కానీ మరో న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ మాత్రం ఈ తీర్పుతో విభేదించారు. చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని పేర్కొన్నారు. దీని ప్రకారం చంద్రబాబును సీఐడీ అరెస్టు, దిగువ కోర్టు రిమాండ్ విధించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, వారి పై అధికారి (గవర్నర్) అనుమతి తీసుకొని ఈ కేసును కొనసాగించవచ్చని తెలిపారు.
 
“రిమాండ్ ఆర్డర్ ను క్వాష్ చేయటం కుదరదు. చంద్రబాబు కేసులో 17 ఏ వర్తిస్తుంది. ముందస్తు అనుమతి తీసుకోకపోయినా రిమాండ్ ఆర్డర్ ను పక్కన పెట్టలేం. పిటిషన్ ను డిస్పోస్ చేస్తున్నాను. సెక్షన్ 17ఏలో గవర్నర్ అనుమతి తీసుకోవాలి. ముందస్తు అనుమతి లేకుండా చర్యలు చట్ట విరుద్ధం. కానీ రిమాండ్ ఆర్డర్ ను క్వాష్ చేయటం సరికాదు. రిమాండ్ చెల్లుబాటు కాదని చెప్పలేం” అని జస్టిస్ బోస్ తెలిపారు.
 
“17ఏ అమల్లో లేనప్పుడు నేరాన్ని వర్తింపజేయలేం. ఈ కేసులో 17ఏ వర్తించదు. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కేసులకే ఈ సెక్షన్ వర్తిస్తుంది. అవినీతి నిరోధక చట్టానికి 17ఏను ముడిపెట్టలేం” అని జస్టిస్ బేలా త్రివేది పేర్కొన్నారు. 2018లో వచ్చిన చట్టం ఆధారంగా చంద్రబాబు పిటిషన్‌ను కొట్టివేయలేమని అభిప్రాయపడ్డారు.  పైగా, ఐపీసీ సెక్షన్లు కూడా నమోదై ఉన్నప్పుడు.. కేవలం సెక్షన్ 17(ఏ) ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోకపోవడం అన్నది ఎఫ్.ఐ.ఆర్ కొట్టేయడానికి కారణం కారాదని స్పష్టం చేశారు.
 
 కాగా, ఇప్పుడు తదుపరి విచారణ కోసం ఈ కేసును ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ కు బదిలీ చేస్తారా లేక ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారిస్తుందా అనేది తేలాల్సి ఉంది.