ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు నియమించింది. రెండు రోజుల క్రితం ఆ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేయడంతో ఆమెను నియమించేందుకు రంగం సిద్ధమైంది. గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఇప్పుడు నియమించారు. 

షర్మిల పార్టీలో చేరే సమయంలోనే పదవీ వీడేందుకు సిద్దమని రుద్రరాజు ప్రకటించారు. తెలంగాణాలో `రాజన్న రాజ్యం’ తీసుకువస్తానంటూ  వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసి, సుమారు రెండేళ్ల పాటు దాదాపు 3,000 కిమీ దూరం పాదయాత్ర జరిపి, చివరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు చేతులెత్తేశారు. 

తాను అన్ని సీట్లలో అభ్యర్థులను పెట్టినా 1 శాతం మించి ఓట్లు పొందలేనని, చివరకు తాను పోటీ చేయదలచిన పాలేరు నియోజకవర్గంలో సహితం 3 శాతం మించి ఓట్లు రావని ఓ సర్వే వెల్లడించడంతో ఆమె కాంగ్రెస్ తో బేరసారాలకు దిగారు. తెలంగాణాలో తనను ఏదో విధంగా ఎమ్యెల్యే చేయడంతో పాటు, కాంగ్రెస్ లో కీలక పదవి ఇవ్వాలని కోరారు. 

అయితే, ఆమెను చేర్చుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విముఖత వ్యక్తం చేయడం, ఆమెను చేర్చుకొంటే ఎన్నికల్లో కాంగ్రెస్ కు నష్టమని వాదించడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా మాట్లాడలేదు. అవసరమైతే ఏపీ కాంగ్రెస్ లో చేరమని రేవంత్ హితవు చెప్పారు. 

దానితో షర్మిల ఆగ్రవేశాలు వ్యక్తం చేసిన షర్మిల తాను తెలంగాణలోనే పుట్టి, పెరిగానని, తెలంగాణ కోడలిని అంటూ తనను చేర్చుకొని పక్షంలో తెలంగాణాలో అన్ని సీట్లలో పోటీ పెట్టి కాంగ్రెస్ కు నష్టం కలిగిస్తానని కూడా బెదిరించారు. ఏదిఏమైతే, ఎన్నికలు ముగిసేవరకు దూరంగా ఉంది, తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటీవల తన పార్టీ వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. 

2, 3 నెలల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ కు 1 లేదా 2 శాతంకు మించి ఓట్లు లేవు. పోటీకి ఎక్కడా బలమైన అభ్యర్థులు కూడా లేరు. కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి కావడం, తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ తో కాంగ్రెస్ కు కొద్దో, గొప్పో ఓట్లు తెస్తారనే ఆశతో ఆమెకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అప్పగించినట్లు కనిపిస్తున్నది. 

ఆమెకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అప్పగించినా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్నది ప్రశ్నార్ధకంగా ఉంది. ఆమెను పార్టీలో చేర్చుకోవడంలో కీలక పాత్ర వహించిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ద్వారా ఆ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎన్నిక కావాలనే ఆలోచనలు ఉన్నట్లు వార్తాలు వచ్చాయి.