16, 17 తేదీల్లో ఏపీ, కేరళలో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 16న, 17 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, కేరళలో పర్యటించనున్నారు. కేంద్ర భాగస్వామ్యంతో నిర్మించిన పలు ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల కొత్త క్యాంపస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కస్టమ్, పరోక్ష పన్నులు 74వ, 75వ బ్యాచ్‌కి చెందిన ఆఫీసర్ ట్రైనీలతో పాటు భూటాన్ రాయల్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనీలతో కూడా ప్రధాన మంత్రి ఇంటరాక్ట్ అవుతారు. జనవరి 16న, మధ్యాహ్నం 3:30 గంటలకు, ప్రధానమంత్రి పాలసముద్రం చేరుకుని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు & నార్కోటిక్స్ (నాసిన్) కొత్త క్యాంపస్‌ను ప్రారంభిస్తారని పిఎంఓ ప్రకటించింది.

500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ అకాడమీ పరోక్ష పన్నులైన కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్,  నార్కోటిక్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ రంగాలలో సమర్థులైన సిబ్బందిని తీర్చిదిద్దుతుందని వివరించారు. జనవరి 17వ తేదీ ఉదయం కేరళలోని గురువాయూర్ ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. త్రిప్రయార్ శ్రీ రామస్వామి ఆలయంలో ఉదయం 10:30 గంటలకు పూజలు చేస్తారు.

ఆ తర్వాత, మధ్యాహ్నం సమయంలో, ప్రధాన మంత్రి ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల రంగానికి సంబంధించిన ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. కొచ్చి పర్యటన సందర్భంగా, ప్రధాన మంత్రి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ వద్ద న్యూ డ్రై డాక్ లో రూ. 4,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన మూడు ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.

సీఎస్ఎల్ ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీ, కొచ్చిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్  ఎల్‌పిజి దిగుమతి టెర్మినల్ ప్రారంభిస్తారు. రూ. 970 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీని కూడా జాతికి అంకితం చేస్తారు. కొచ్చిలోని పుతువైపీన్‌లో ఇండియన్ ఆయిల్ ఎల్‌పిజి దిగుమతి టెర్మినల్ సుమారు రూ. 1,236 కోట్లతో నిర్మించినట్టు పిఎంఓ పేర్కొంది.

16న మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలసముద్రం చేరుకుని అక్కడ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్,ఇన్డైరక్ట్ టాక్టెస్ అండ్ నార్కోటిక్స్(నాసిన్) భవనం మొదటి అంతస్తులో గల యాంటీక్యూస్  స్మగ్లింగ్ స్టడీ సెంటర్ ను, నార్కోటిక్స్ స్టడీ సెంటర్ ను సందర్శిస్తారు. అదే విధంగా వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ కేంద్రాన్ని సందర్శిస్తారు.

అనంతరం ప్రధాని మోదీ  గ్రౌండ్ ఫ్లోర్ లోని ఎక్స్- రే,బ్యాగేజ్ స్క్రీనింగ్ కేంద్రాన్ని సందర్శిస్తారు. తదుపరి ఎకాడమీ బ్లాకు వద్ద రుద్రాక్ష మొక్కలను నాటి అక్కడ నిర్మాణ కార్మికులతో మాట్లాడి, వారితో గ్రూపు పొటో దిగుతారు. అనంతరం 74,75వ బ్యాచ్ ల ఆఫీసర్ ట్రైనీలతో ఇంటరాక్ట్ అవుతారు. బహిరంగ సభలో `ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం’ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. తదుపరి నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్డైరక్ట్ టాక్టెస్ అండ్ నార్కోటిక్స్ కేంద్రానికి అక్రెడిటేషన్ సర్టిఫికెట్ ను అందిస్తారు.