మందిర ప్రారంభోత్సవానికి 45 వేల కిలోల లడ్డూలు

రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా అతిథులు, భక్తులకు పంపిణీ చేయడానికి 45 వేల కిలోల లడ్డూలను సిద్ధం చేస్తున్నారు. ఈ లడ్డూలతో పాటు ఇతర మతపరమైన వస్తువులను ఈ వేడుక సందర్భంగా రామ మందిరాన్ని సందర్శించే భక్తులకు పంపిణీ చేయనున్నారు. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ  కార్యక్రమం సందర్భంగా ఈ లడ్డూలను సకాలంలో సిద్ధం చేసేందుకు వారణాసికి చెందిన మిఠాయిలు తయారు చేసే ప్రత్యేక బృందం 24 గంటలు పనిచేస్తోంది.

ఈ లడ్డూలతో పాటు ఇతర మతపరమైన వస్తువులను రామ మందిరానికి వచ్చే భక్తులకు పంపిణీ చేయనున్నారు. అయోధ్య ఆలయంలో జరిగే వేడుకల్లో పాల్గొనే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి వరకు ఈ లడ్డూల తయారీ కొనసాగనుంది. ఈ లడ్డూలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయని, వీటికి మూడు నుంచి నాలుగు నెలల పాటు షెల్ఫ్ లైఫ్ ఉంటుందని చెబుతున్నారు.

శనగపిండితో పాటు యాలకులు, జీడిపప్పు, కుంకుమపువ్వు, స్వచ్ఛమైన దేశీ నెయ్యి తదితర ఆహ్లాదకరమైన రుచులతో ఈ లడ్డూలను తయారు చేస్తున్నారు.  ఈ ప్రత్యేక లడ్డూను రూపొందించడంలో స్వచ్ఛమైన దేశీ నెయ్యిని ఉపయోగించామని తయారీ దారులు చెబుతున్నారు. కిలో శెనగపిండికి కిలో పంచదార, కిలో దేశీ ఆవు నెయ్యి కలుపుతున్నామని తెలిపారు. “ఇది బెనారస్ (వారణాసి) నుండి వచ్చిన ప్రసిద్ధ వంటకం” అని గర్వంగా చెప్పారు.

అతిథులందరికీ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు రతన్ లాల్ అగర్వాల్ అనే మిఠాయి వ్యాపారి తెలిపారు. లడ్డూలతో పాటు ప్రసాదం ప్యాకెట్లో ‘రామ్’ పేరుతో అలంకరించిన పుస్తకం, జోలా, చున్నీ ఉంటాయి. జనవరి 22న జరిగే ఈ కార్యక్రమానికి హాజరయ్యే వీఐపీలకు శ్రీరాముడి స్టిక్కర్, అయోధ్య ఆలయ చిత్రణతో కూడిన ప్రత్యేకంగా రూపొందించిన టిఫిన్ బాక్స్ కూడా అందనుంది.

సీతమ్మకు ధర్మవరం పట్టు చీర

అయోధ్య సీతమ్మకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన ధర్మవరం పట్టు చీర ఇది. 180 అడుగుల పొడవు, 40 అంగుళాల వెడల్పు తో ఉన్న ఈ చీరపై 13 భాషల్లో జై శ్రీరామ్‌ నినాదం, చీర అంచుల్లో రామయాణంలోని 400 ఘట్టాల చిత్రీకరణ వంటి ఎన్నో ప్రత్యేకతలున్న ఈ పట్టు చీరను శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చేనేత కార్మికుడు నాగరాజు రూపొందించారు. 

 
చీర తయారీకి మల్బరీ దారంతోపాటు కాటన్‌, లెనిన్‌, గద్వాల్‌, సిలికాన్‌, కొర్నియా తదితర రకాల పట్టు పోగులను వినియోగించారు. రూ.5 లక్షల ఖర్చుతో ఈ పట్టు చీర నేసేందుకు 4 నెలలు పట్టింది. ఈనెల 22న అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అమ్మవారికి కానుకగా అందజేయాలనుకున్నానని నాగరాజు తెలిపారు. అయోధ్య రామజన్మభూమి కమిటీ పెద్దల సూచన మేరకు చీరను రూపొందించానని చెప్పారు.