ఢిల్లీలో పొగమంచుతో ఆలస్యంగా వందకుపైగా విమానాలు

దేశ రాజధానిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీతోపాటు ఉత్తర భారతదేశాన్ని మంచు దుప్పటి కమ్మేసింది. దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. 
 
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విజబిలిటి పడిపోవడంతో రోడ్డుపై వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొన్నది. కాగా, రెండు వారాల సెలవుల అనంతరం సోమవారం పాఠశాలలు తెరచుకోనున్నాయి. అయితే చల్లటి వాతావారణం కారణంగా స్కూళ్ల పనివేళలను ప్రభుత్వం కుదించింది.
 
పొగమంచు భారీగా కురుస్తుండటంతో విజిబిలిటీ పడిపోయింది. ఈనేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు రావాల్సిన సుమారు 110 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 79 విమానాలు రద్దయ్యాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులను ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు అప్రమత్తం చేశాయి. దట్టమైన మంచువల్ల తాము ప్రయాణించాల్సిన విమానాల కోసం ప్రయాణికులు వేచి చూడాలని, వివరాలకోసం విమానయాన సంస్థలను సంప్రథించాలని సూచించారు.
ఢిల్లీ, కోల్‌కతాలో వాతావరణ పరిస్థితుల వల్ల ఇండిగో, స్పైస్‌జెట్‌, విస్తారా విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది.  అనేక ప్రాంతాలలో విజిబిలిటీ స్థాయిలు సున్నాకు పడిపోవడంతో కేంద్రం ఆదివారం పలు ఆంక్షలు విధించింది. ఢిల్లీ, ఎన్‌సిఆర్‌ పరిధిలో నిర్మాణాలపై కేంద్రం నిషేధం విధించింది. బిఎస్‌-3 పెట్రోల్‌, బిఎస్‌-4 డీజిల్‌ ఫోర్‌ వీలర్‌లను నడపడంపై కూడా నిషేధం విధించింది.
అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, డ్రైవింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రజలను హెచ్చరించింది.  శనివారం రాత్రి 10 గంటల నుండి పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లలో దట్టమైన పొగమంచు కమ్ముకున్నట్లు ఐఎండి అధికారి ఒకరు తెలిపారు. పంజాబ్‌, ఉత్తర రాజస్థాన్‌ నుండి ఈశాన్యం వరకు దట్టమైన పొగమంచుతో కప్పేసిన దృశ్యాలు శాటిలైట్‌లో కనిపించాయి. 
 
గంగానగర్‌, పాటియాలా, అంబాలా, చంఢగీఢ్‌, ఢిల్లీ, బరేలీ, లక్నో, బహ్రైచ్‌, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌, తేజ్‌పూర్‌ మీదుగా అమృత్‌సర్‌ నుండి దిబ్రూగఢ్‌ వరకు జీరో విజిబిలిటీ నమోదవడం ఇదే మొదటిసారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.