రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు ఫోన్

రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు ఫోన్
భారతీయ జనతా పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ చేసిన దుండగులు శ్రీరామ నవమి సందర్భంగా శోభాయాత్ర చేపడితే చంపేస్తామంటూ ఆయన్ను బెదిరించారు. దీంతో రాజా సింగ్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ ఎవరు చేశారనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి సందర్భంగా రాజా సింగ్ శోభాయాత్ర నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు బెదిరింపు కాల్ రావడం గమనార్హం. గతంలో కూడా ఆయనకు ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి.
 
చంపేస్తామంటూ బెదిరింపులు రావడంపై స్పందించిన రాజాసింగ్ ‘ఫోన్‌లో కాదు దమ్ము ఉంటే నేరుగా రావాలని’ సవాళ్లు విసిరారు.7199942827, 4223532270 నెంబర్స్ నుంచి తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని రాజా సింగ్ తెలిపారు. అయ్యోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో రాజసింగ్‌కు తాజాగా బెదిరింపులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది ఇలావుండగా, కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే రాజా సింగ్ అప్పటి రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌కి లేఖ రాశారు. తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు తనకు ఏ ఏ నెంబర్ల నుంచి కాల్స్ వచ్చాయో ఆ జాబితాను డీజీపీకి రాసిన లేఖలో వివరించారు.  తనను చంపుతామంటూ పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కూడా వెల్లడించారు రాజా సింగ్.