మోదీ నేతృత్వంలో `సూపర్ పవర్’గా భారత్!

ప్రధానమంత్రి నేతృత్వంలో భారతదేశం సూపర్ పవర్‌గా ఎదుగుతోందని కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్ కె. సింగ్ భరోసా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లోని హైలమ్ కాలనీ, బాగ్‌లింగంపల్లి – సుందరయ్య పార్కులో శనివారం జరిగిన వికాసిత్ భారత్ సంకల్ప యాత్రలో మంత్రి పాల్గొంటూ దేశాన్ని శక్తివంతం చేశామని, మన శత్రువులు ఉగ్రదాడులు చేయడం మానేశారని తెలిపారు.
 
పాకిస్తాన్ అయినా చైనా అయినా వారికి తగిన సమాధానం ఇచ్చామని చెబుతూ భారత దేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద శక్తిగా ఉందని, దేశాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆ తర్వాతే పేద ప్రజలను పేదరికం నుండి బయటకు తీసుకురావడమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 
ప్రతి పేదవాడికి ఆహారం, విద్యుత్, నీరు అందుబాటులో ఉండాలని పేర్కొంటూ  ప్రతి పేద కుటుంబాన్ని అభివృద్ధిలోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం నిబద్ధతతో చేపడుతున్న కార్యక్రమాలకు తిరుగులేదని స్పష్టం చేశారు.
ప్రజలు అభివృద్ధి చెందడానికి ప్రభుత్వ పథకాలు ఎలా సహాయపడతాయో మంత్రి వివరించారు.  ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోని వారు కూడా దరఖాస్తు చేసుకుని ప్రయోజనాలను పొందాలని కేంద్ర మంత్రి సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని తమ జీవితాలను మెరుగుపరుచుకునేందుకు ఇదో చక్కటి అవకాశమని చెప్పారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, 5 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించే ఆయుష్మాన్ భారత్, వీధి వ్యాపారులకు వ్యాపార ప్రయోజనాల కోసం రుణాలు అందించే ప్రధానమంత్రి స్వానిధి యోజన, జీవన్ జ్యోతి బీమా యో జన, తక్కువ ప్రీమియంతో బీమా పథకం వంటి వివిధ పథకాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 

లబ్ధిదారులు ఎలాంటి పూచీకత్తు లేకుండా వ్యాపార రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించే ముద్రా యోజన సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు ప్రయోజనం చేకూర్చుతుందని సింగ్ తెలిపారు. దేశంలోని పేదలందరికీ 5 సంవత్సరాలకు 5 కిలోల ఉచిత రేషన్‌ను ప్రధానిమంత్రి అందింస్తున్నారని కేంద్ర మంత్రి చెప్పారు.