గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్‌లో ప్రాధాన్య అంశంగా ప్రతిపాదించిన ఫార్మాసిటీని రద్దు చేసేందుకు అనుమతించాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఉపసంహరించుకుంటామని, కొత్త ప్రతిపాదనలు చేసేందుకు అనుమతించాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కోరారు.
రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శనివారం ఢిల్లీలో పీయూష్ గోయల్‌ను ఆయన కార్యాలయంలో కలిసి రాష్ర్టానికి రావాల్సిన వివిధ ప్రాజెక్టులు, వివిధ సమస్యలపై చర్చించారు. పారిశ్రామిక వికేంద్రీకరణలో భాగంగా, హైదరాబాద్‌లో రద్దీని తగ్గించేందుకు వీలుగా నగరానికి నలువైపులా పది ఫార్మా విలేజ్‌లను అభివృద్ధి చేస్తామని రేవంత్‌రెడ్డి ఇటీవల మీడియాకు వెల్లడించారు.
గత ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా యాచారంలో ఒకే చోట 20వేల ఎకరాలలో ఫార్మాసిటీని నిర్మించాలన్న ప్రతిపాదనకు విరుద్ధంగా రేవంత్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. అయితే, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ముఖ్యమంత్రి తాము హైదరాబాద్ ఫార్మా సిటీని రద్దు చేయడం లేదని స్పష్టం చేశారు.
మరోవైపు తాము 500 నుంచి వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఫార్మా విలేజ్‌లను ఏర్పాటు చేస్తామని, వాటి చుట్టూ నివాస స్థలాలు, పాఠశాలలు, కాలేజీలు, దవాఖానలు, ఆహార విక్రయ కేంద్రాలు ఉంటాయని పేర్కొన్నారు. ఒక్కో ఫార్మా విలేజ్‌లో 10 ఫార్మా కంపెనీలు ఉంటాయని తెలిపారు.
తాజాగా ఆయన కేంద్రం ముందు మరో కొత్త పారిశ్రామిక కారిడార్‌ను ప్రతిపాదించడంతోపాటు ఫార్మాసిటీకి కూడా మరో ప్రతిపాదన చేస్తామని చెప్పడం గమనార్హం. హైదరాబాద్ వయా మిర్యాలగూడ -విజయవాడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రికి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. దీంతో ఈ కొత్త కారిడార్‌లోనే ఫార్మాసిటీకి సంబంధించిన ప్రతిపాదన చేస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.హైదరాబాద్ -నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు మంజూరు చేయాలని, దీనివల్ల రాష్ట్రానికి రూ. 2,300 కోట్లు విడుదలవుతాయని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌కు నేషనల్ డిజైన్ సెంటర్ (ఎన్‌ఐడీ) మంజూరైందని, నాటి కేంద్రమంత్రి ఆనంద్‌శర్మ దానికి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు.
అయితే, రాష్ట్ర విభజన తర్వాత ఎన్‌ఐడీని విజయవాడకు తరలించారని, ఈ నేపథ్యంలో తెలంగాణకు మరో ఎన్‌ఐడీ మంజూరు చేయాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లాకు మెగా లెదర్ పార్ మంజూరు చేసిందని గుర్తుచేస్తూ తెలంగాణలో కరీంనగర్, జనగాం జిల్లాల్లో లెదర్ పార్ ఏర్పాటుకు అవసరమైన భూములున్నాయని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం మెగా లెదర్ పార్ మంజూరు చేస్తే వెంటనే భూమి కేటాయిస్తామని తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ, ఇది మంచి ప్రతిపాదన అని, ఇందుకు సంబంధించిన అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి రాష్ట్రానికి రావల్సిన నిధులు విడుదల చేయాలని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సీఎం కోరారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు కేంద్రం నుంచి రావాల్సిన రూ. 4,256 కోట్ల ధాన్యం సబ్సిడీ నిధులను ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ, యాసంగి బాయిల్డ్ రైస్ సమస్య, సీఎమ్మార్ గడువు పెంపు తదితర అంశాలపై చర్చించారు.
More Stories
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
భగవద్గీతలోని సర్వకాలీన విజ్ఞానం