చెన్నై, బెంగళూరుల నుండి అయోధ్యకు స్పైస్‌జెట్‌

 
* ముంబై, వారణాసిల నుండి కూడా
 
అయోధ్య రామ మందిరం ప్రారంభం నేపథ్యంలో స్పైస్‌జెట్‌ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ముంబయి, చెన్నై, బెంగళూరు, వారణాసిల నుంచి అయోధ్యకు ప్రత్యేకంగా విమాన సర్వీసులను ప్రారంభించనున్నది. వారంలో మూడురోజుల పాటు విమానాలు నడిపేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. అలాగే టికెట్ల బుకింగ్‌ సైతం మొదలైంది. 
 
జనవరి 22 తర్వాత నుంచి సామాన్య భక్తులకు దర్శనాలు కల్పించనున్న విషయం తెలిసిందే. అయితే, అయోధ్యకు చేరుకునేందుకు ఎక్కువగా దక్షిణ భారతం నుంచి ఆసక్తి చూపుతున్నారు. రామేశ్వరం, అయోధ్య మధ్య నేరుగా విమాన సర్వీసులు మొదలు కావడంతో పర్యాటకులకు ఎంతో సౌలభ్యం కలుగనున్నది.

అలాగే, వచ్చే నెల ఒకటో తేదీ నుంచి బెంగళూరు – వారణాసి మధ్య స్పైస్‌జెట్‌ విమానాలు నడుపనున్నది. బెంగళూరు నుంచి ఉదయం 10.50 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు బబత్‌పూర్‌ విమానాశ్రయానికి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 2.10గంటలకు బబత్‌పూర్‌లో బయలుదేరి సాయంత్రం 4.45 గంటలకు బెంగళూరుకు వస్తుంది. 

మంగళవారం, గురువారం, శనివారాల్లో ఈ విమానం నడువనున్నది. ప్రస్తుతం ఇండిగో సంస్థ బెంగళూరు- వారణాసి మధ్య సేవలు అందిస్తున్నది. స్పైస్ జెట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం చెన్నై-అయోధ్య మధ్య రోజువారీ విమాన సర్వీసు నడువనున్నది.  చెన్నై నుంచి మధ్యాహ్నం 12.40 గంటలకు బయలుదేరి 3.15 గంటలకు అయోధ్య విమానాశ్రయానికి చేరుకుంటుంది. సాయంత్రం 4 గంటలకు అయోధ్య తిరుగు ప్రయాణమై 6.20 గంటలకు చెన్నై చేరుకుంటుంది.

బెంగళూరు- అయోధ్య మధ్య విమాన సర్వీసు ఫిబ్రవరి 2 నుంచి వారానికి నాలుగు రోజులు ప్రారంభమవుతుంది. ఈ విమానం బెంగళూరు విమానాశ్రయం నుంచి ఉదయం 10.50 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు అయోధ్య విమానాశ్రయానికి చేరుకుంటుంది. 

తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.10 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.45 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఉదయం ఆరు గంటలకు సైతం అయోధ్య నుంచి బెంగళూరుకు విమానం విమానం నడువనున్నది. మంగళవారం, శనివారాలు నడుస్తుంది. ఉదయం 6 గంటలకు అయోధ్య నుంచి బయలుదేరి 10.40 గంటలకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంటుంది.

ముంబయి- అయోధ్య మధ్య విమాన సర్వీసు ఫిబ్రవరి 2 నుండి వారానికి ఐదు రోజులు నడుస్తుంది. ముంబయి విమానాశ్రయం నుంచి ఉదయం 8.20 గంటలకు బయలుదేరి 10.40 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. తిరిగి అయోధ్య నుంచి ఉదయం 11.10 గంటలకు బయలుదేరి 1.20 గంటలకు ముంబయి విమానాశ్రయానికి చేరుకుంటుంది. 

వచ్చే నెల నుంచి అయోధ్య విమానాశ్రయం నుంచి చెన్నై, బెంగళూరు, ముంబయిలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వారణాసి- బెంగళూరు నుంచి నేరుగా విమానాలు నడుస్తాయని, అడ్వాన్స్‌ టికెట్‌ బుకింగ్‌ సైతం మొదలైందని స్పైస్‌జెట్‌ యూపీ ఈస్టర్న్‌ జోన్‌ సేల్స్‌ హెడ్‌ మనీశ్‌ సింగ్‌ తెలిపారు.