పీఎం-జన్‌మన్ లబ్ధిదారులకు రూ 540 కోట్లు

దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు సంక్రాంతి కానుక అందించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ప్రధాన మంత్రి జన జ్యోతి ఆదివాసీ న్యాయ మహా అభియనాన్ (పీఎం-జన్‌మన్) కింద రూరల్ హౌసింగ్ స్కీమ్ కోసం తొలి విడత రూ. 540 కోట్ల నిధులు విడుదల చేశారు. దీంతో తొలి విడత కింద సుమారు లక్ష మంది గ్రామీణ ప్రజలకు లబ్ధి చేకూరనుంది. 
 
ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిధులను విడుదల చేశారు మోదీ. ప్రభుత్వ పథాకాలను ఉపయోగించుకోవడం ద్వారా తమ జీవితాలు ఏవిధంగా మెరుగుపడ్డాయో, తమ అనుభవాలు ఏమిటో లబ్ధిదారులు ప్రధానికి తెలియజేశారు. వంటగ్యాసు కనెక్షన్లు, విద్యుత్, పైపుల ద్వారా నీళ్లు, గృహాల వంటి కనీస సౌకర్యాల ద్వారా తమ జీవితాల్లో వచ్చిన మార్పులను వివరించారు.
 
2023, నవంబర్ 15 వ తేదీన ట్రైబల్ ప్రైడ్ డే సందర్భంగా పీఎం జన్ మన్ పథకాన్ని ప్రారంభించింది కేంద్రం. బలహీన గిరిజన సమూహాల సామాజిక ఆర్థిక సంక్షేమం కోసం తీసుకొచ్చింది. దాదాపు రూ. 24 వేల కోట్లు వెచ్చించనున్నారు. బలహీన గిరిజన కుటుంబాలు సురక్షితమైన ఇండ్లు, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య, విద్యుత్తు, రహదారి, టెలికాం కనెక్టివిటి వంటి మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు.
 
దేశంలో షెడ్యూల్డ్ తెగ జనాభా 10. 45 కోట్లుగా ఉంది. 18 రాష్ట్రాలు, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో 75 గిరిజన కమ్యూనిటీలు సామాజిక, ఆర్థిక, విద్యా రంగాలలో వెనకబడి ఉన్నట్లు గుర్తించారు.  ఈ క్రమంలోనే వారి కోసం కేంద్రం ప్రత్యేక పథకాన్ని 2023- 24 బడ్జెట్లో తీసుకొచ్చింది. 500 బ్లాక్‌లు, 15000 బలహీన గిరిజన కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం మొదటి 100 జిల్లాలలో తొలి విడత ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఇతర జిల్లాల్లో రెండో దశలో చేపట్టనున్నారు.
 
గిరిజన కుటుంబాలకు వ్యక్తిగత హక్కులు కల్పించడం, ప్రాథమిక మౌలిక సౌకర్యాలతో సొంతిల్లు నిర్మించడమే లక్ష్యంగా చేసిన ప్రయత్నంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఏ ఒక్కరు సంక్షేమ పథకాలకు దూరం కాకుండా చూసుకోవడం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. 
 
వెనుకబడిన గిరిజన కుటుంబాలకు ప్రతి సంక్షేమ పథకం చేరాలని చెబుతూ అదే పీఎం జన్ మన మహా అభియాన్ లక్ష్యమని పేర్కొన్నారు మోదీ. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని వారికి చేర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు.