మళ్లీ మోదీయే ప్రధాని.. మాజీ ప్రధాని దేవెగౌడ

నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అవుతారని భారత మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవేగౌడ జోస్యం చెప్పారు. మూడోసారి ప్రధాని అయ్యే సత్తా ఆయనకు మాత్రమే ఉన్నదని స్పష్టం చేశారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న కావేరి సమస్యను నరేంద్ర మోదీ మాత్రమే పరిష్కరించగలరని ఆయన భరోసా వ్యక్తం చేశారు.

తమిళనాడు ప్రభుత్వం ప్రతి ఏడాది కావేరి నీటిని విడుదల చేయాలంటూ ‘కావేరి వాటర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ’ అథారిటీకి లేఖ రాస్తుందని, తమ దగ్గర నీళ్లు లేకపోయినా, తమ అధికారులు చెప్పేది వినకుండా అథారిటీ తమిళనాడుకు నీళ్లు విడుదల చేయాలని ఆదేశిస్తుందని దేవేగౌడ ఆవేదన వ్యక్తంచేశారు. 

వాస్తవానికి కావేరి అథారిటీ ఎన్నడూ కర్ణాటకకు రాదని, తమ రిజర్వాయర్లలో ఎన్ని నీళ్లు ఉన్నాయో కూడా చూడదని ఆయన విమర్శించారు. తాను తన ఊపిరి ఉన్నంత వరకు కావేరి సమస్య పరిష్కారం కోసం పోరాటం చేస్తానని దేవేగౌడ చెప్పారు. 

తాను ఇంకా రెండున్నరేళ్లు రాజ్యసభ సభ్యుడిగా ఉంటానని, ఈ రెండున్నరేళ్లు తాను సభలో నోర్మూసుకుని కూర్చోనని తేల్చి చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు తాను ఫిబ్రవరి 1న ఢిల్లీకి వెళ్తున్నానని, ఈ సందర్భంగా రాజ్యసభలో కావేరి సమస్యపై తన గళం బలంగా వినిపిస్తానని ఆయన తెలిపారు.