శాస్త్ర ప్రకారమే రామాలయ నిర్మాణం

అయోధ్యలో శ్రీ రామ జ‌న్మ‌భూమిలో ఆల‌యం నిర్మాణం శాస్త్ర ప్ర‌కారమే  జ‌రుగుతోంద‌ని శ్రీరామ జ‌న్మ‌భూమి తీర్థ‌క్షేత్ర ప్ర‌ధాన అర్చ‌కుడు ఆచార్య స‌త్యేంద్ర దాస్ స్పష్టం చేశారు. ఈ నెల 22న జ‌ర‌గ‌నున్న ప్రాణ ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మానికి హాజ‌రుకావ‌ద్దు అన్న నెపంతోనే కాంగ్రెస్ పార్టీ సాకులు చెబుతోంద‌ని విచారం వ్యక్తం చేశారు. 

ఆల‌య నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణ ప్ర‌తిష్ట చేస్తున్నార‌ని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. నాలుగు మ‌ఠాల‌కు చెందిన శంక‌రాచార్యులు కూడా అయోధ్య రామాల‌య ప్రాణ ప్ర‌తిష్ట‌పై ఇటీవ‌ల స్పందించారు. అయితే ఈ అంశంపై శంక‌రాచార్యుల అభిప్రాయాల‌ను, ఆలోచ‌న‌ల‌ను ప్ర‌శ్నించ‌లేమ‌ని, ఆ అంశంపై తానేమీ మాట్లాడ‌లేన‌ని స‌త్యేంద్ర దాస్ తెలిపారు.

రామాల‌య నిర్మాణాన్ని బీజేపీ రాజ‌కీయం వాడుకుంటున్న‌ట్లు అంశంపై కూడా స‌త్యేంద్ర దాస్ స్పందిస్తూ రాజ‌నీతి, ధ‌ర్మ‌నీతి ఉంటుంద‌ని, శ్రీరాముడిని బీజేపీ సొంతం చేసుకున్న‌ద‌ని, అందుకే ఆ పార్టీకి ఆయ‌న ఆశీస్సులు ద‌క్కాయ‌ని చెప్పారు. ఇది రాజ‌నీతి కాదు అని, కానీ దీన్నే ధ‌ర్మ‌నీతి అంటార‌ని స‌త్యేంద్ర దాస్ తెలిపారు. 

ఇప్పుడు రామ రాజ్యం వ‌స్తోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. రామ్ ల‌ల్లాను శాశ్వత గుడికి మార్చాల‌న్న ప్ర‌య‌త్నాల‌ను మ‌రే పార్టీ చేయ‌లేద‌ని ఆయ‌న గుర్తు చేశారు.  బెంగాల్‌లో సాధువుల‌పై జ‌రిగిన దాడి గురించి  స‌త్యేంద్ర దాస్ ఆగరహం వ్యక్తం చేశారు. మ‌మ‌తా బెన‌ర్జీకి ముంతాజ్ ఖాన్ అన్న పేరు ఉంద‌ని అంటూ విమ‌ర్శించారు. 

బెంగాల్‌లో రామ‌న‌వ‌మి, ఇత‌ర ర్యాలీల స‌మ‌యంలోనూ దాడులు జ‌రిగిన‌ట్లు చెప్పారు. కాషాయ రంగు చూస్తే ఆమె ఆగ్ర‌హానికి గుర‌వుతుంద‌ని, అందుకే ఈ దాడులు జ‌రుగుతాయ‌ని ఆయన మండిపడ్డారు. ఇలాంటి దాడుల్ని ఖండిస్తున్న‌ట్లు స‌త్యేంద్ర దాస్ తెలిపారు.

ఇదిలా ఉండగా, ‘శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమానికి నలుగురు శంకరాచార్యులు హాజరుకావటం లేదన్న మీడియా కథనాల్ని పూరి శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి ఖండించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంపై తమ మధ్య ఎలాంటి విభేదాల్లేవన్నారు.

మారిషస్ లో రెండు గంటల ప్రత్యేక సెలవు 

రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా హిందూ ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 22న రెండు గంటల ప్రత్యేక సెలవును మారిషస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో మారిషస్‌లోని హిందూ ప్రభుత్వ ఉద్యోగులు జనవరి 22న జరిగే రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూసే అవకాశం దక్కనున్నది.  ఈ ప్రత్యేక సెలవుదినం మధ్యాహ్నం 2 గంటల నుంచి 2 గంటల పాటు ఉండనున్నది. మారిషస్ జనాభాలో 48.5శాతం హిందువులు ఉన్నారు. సెంటిమెంట్లు, సంప్రదాయాలను గౌరవించేందుకు ఇదో చిన్న ప్రయత్నమని మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ పేర్కొన్నారు.