‘ఇండియా’ కూటమి అధ్యక్షునిగా మల్లిఖార్జున్ ఖర్గే

* కన్వీనర్ గా నితీష్ నియామకంపై గందరగోళం

ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమితులయ్యారు. కూటమి అధ్యక్షునిగా ఎవరిని నియమించాలనే విషయంలో గత కొన్ని వారాలుగా కూటమి నేతల మధ్య తర్జనభర్జనలు కొనసాగాయి. అనంతరం, శనివారం వర్చువల్ గా సమావేశమైన ఇండియా కూటమి నేతలు మల్లిఖార్జున్ ఖర్గేను తమ చైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఇండియా కూటమిలో కీలకమైన కన్వీనర్ పదవి విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ పదవికి  బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ పేరును కూటమి నేతలు ప్రతిపాదించి, ఆమోదం తెలిపారు. కానీ, కన్వీనర్ పదవిని స్వీకరించడానికి నితీశ్ కుమార్ అంగీకరించలేదని సమాచారం. 

అయితే, కన్వీనర్ పదవికి నితీశ్ కుమార్ ను ఎంపిక చేయడాన్ని టీఎంసీ వ్యతిరేకించిందని, అందువల్లనే ఆయన ఆ పదవిని తిరస్కరించారని తెలుస్తోంది.  నితీశ్ పేరుకు ఎవరు కూడా అభ్యంతరం చెప్పలేదు కానీ తాను ఈ విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో చర్చిస్తానని ఖర్గే చెప్పారు.

సమావేశంలో కన్వీనర్ పదవికి నితీశ్ కుమార్ పేరును సూచించడం జరిగిందని, అయితే కన్వీనర్‌ను నియమించాల్సిన అవసరం లేదని, పార్టీల అధ్యక్షులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తే సరిపోతుందని నితీశ్ అన్నారని ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ తెలిపారు.  కాగా, వర్చువల్ గా జరిగిన ఈ భేటీకి సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ,  శివసేన (యుబిటి) అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే హాజరు కాలేదు.

వారికి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి తెలియజేస్తారని కూటమి నేతలు తెలిపారు. మరోవంక, ప్రస్తుతం విపక్ష కూటమి ఇండియా నేతల మధ్య రానున్న లోక్ సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ఓటమి లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఉన్న 28 పార్టీలు ‘ఇండియా’ పేరుతో ఒక కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. 

శనివారం వర్చువల్ గా జరిగిన ఈ సమావేశం గురించి శుక్రవారం సాయంత్రం పార్టీకి సమాచారం అందిందని, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి కొన్ని ముందస్తు కార్యక్రమాలు ఉండడం వల్ల ఆమె హాజరు కాలేదని టీఎంసీ వర్గాలు తెలిపాయి.

మరోవంక, సీట్ల సర్దుబాట్లకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో కాంగ్రెస్ పార్టీ శుక్రవారంనాడు సమావేశం జరిపింది. ముకుల్ వాస్నిక్ నివాసంలో రెండు గంటల సేపు జరిగిన సమావేశంలో ఇరు పార్టీల నేతలు పాల్గొన్నారు. పొత్తులపై రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరినట్టు తెలుస్తోంది. కాగా, శనివారంనాడు జార్ఖాండ్ నేతలతో కాంగ్రెస్ చర్చలు జరిపింది.