పీవోకేలో పాక్ బ్రిట‌న్ హైక‌మిష‌న‌ర్.. భారత్ నిరసన

`పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ (పీవోకే)`లో ఇస్లామాబాద్ బ్రిట‌న్ హైక‌మిష‌న‌ర్ ప‌ర్య‌ట‌న‌పై భార‌త్ తీవ్ర నిర‌స‌న తెలిపింది. `భార‌త్ ప్రాదేశిక స‌మ‌గ్ర‌త‌ను ఉల్లంఘించ‌డం ఆమోద‌యోగ్యం కాదు. ఎల్లవేళ‌లా భార‌త్‌లో జ‌మ్ముక‌శ్మీర్ స‌మ‌గ్ర భాగం` అని విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ స్పష్టం చేసింది. 

పీఓకేలో పాక్‌లో బ్రిట‌న్ హైక‌మిష‌న‌ర్ జాన్ మారియ‌ట్ ప‌ర్య‌ట‌న‌పై స్పందిస్తూ `ఇస్లామాబాద్‌లో బ్రిట‌న్ హై క‌మిష‌న‌ర్ జాన్ మారియ‌ట్ పీవోకేలో ప‌ర్య‌టించ‌డం అత్యంత అభ్యంత‌ర‌క‌రం. దీన్ని భార‌త్ తీవ్రంగా ప‌రిగ‌ణిస్తుంది. బ్రిట‌న్ విదేశాంగ‌శాఖ అధికారితో క‌లిసి పీవోకేలో ఈ నెల 10న ప‌ర్య‌టించారు. భార‌త సార్వ‌భౌమ‌త్వం, ప్రాదేశిక‌త స‌మ‌గ్ర‌త‌ను ఉల్లంఘించ‌డం ఎంత మాత్ర‌మూ స‌మంజ‌సం కాదు` అని పేర్కొన్నారు.

దీనిపై భార‌త్‌ల బ్రిట‌న్ హై క‌మిష‌న‌ర్‌ను పిలిపించి విదేశాంగ‌శాఖ కార్య‌ద‌ర్శి వినయ్ మోహన్ క్వత్రా తీవ్ర నిర‌స‌న తెలిపారు. `కేంద్ర పాలిత ప్రాంతాలైన జ‌మ్ము అండ్ క‌శ్మీర్‌, ల‌డ‌ఖ్ ఎల్ల‌వేళ‌లా భార‌త్‌లో అంత‌ర్భాగ‌మే` అని విదేశాంగ‌శాఖ‌ తేల్చి చెప్పింది.  ఈ విధంగా పర్యటన జరపడం భారత్ సార్వభౌమత్వం, సమగ్రత, అంతర్గత వ్యవహారాలలో జోక్యంగా పరిగణిస్తామని భారత్ స్పష్టం చేసింది.

పాకిస్థాన్‌లో బ్రిట‌న్ హై క‌మిష‌న‌ర్ జాన్ మారియ‌ట్ ఈ నెల 10న పీవోకేలో కేంద్ర స్థాన‌మైన మిర్‌పూర్‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా దిగిన ఫోటోలు, వీడియోల‌ను `ఎక్స్‌`లో పోస్ట్ చేశారు. `బ్రిట‌న్‌, పాకిస్థాన్ పౌరుల మ‌ధ్య సంబంధాల‌కు గుండెకాయ మిర్పూర్‌కు స‌లాం. 70 శాతం బ్రిట‌న్ పాకిస్థానీయుల మూలాలూ మిర్పూర్ నుంచే వ‌చ్చాయి’ అని ఆమె తెలిపారు.

`ప్ర‌వాసుల ప్ర‌యోజ‌నాల కోసం మ‌మ్ముల్ని క‌లిసి ప‌ని చేసేలా చేస్తోంది. మీ ఆతిథ్యానికి ధ‌న్య‌వాదాలు` అంటూ ఆమె పోస్ట్ పెట్టారు. జాన్ మారియ‌ట్ పీఓకే ప‌ర్య‌ట‌న‌పై పాక్‌లో బ్రిట‌న్ హైక‌మిష‌న‌ర్ ట్విట్ట‌ర్ హ్యాండిల్‌ వీడియోను పోస్ట్ చేసింది. మిర్పూర్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా స్థానికుల‌తో క‌లిసి ఫోటోల‌కు ఫోజులిచ్చిన జాన్ మారియ‌ట్ బేక‌రిలోకి వెళ్లారు. స్థానిక జిల్లా అధికారుల‌తో చ‌ర్చించారు.