వర్చువల్‌ కూటమికి వర్చువల్‌ సమావేశాలు మాత్రమే

లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు శనివారం ఉదయం ‘ఇండియా’ పార్టీల నేతలు వర్చువల్ విధానంలో సమావేశం కావడాన్ని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఎద్దేవా చేశారు. ‘వర్చువల్‌ కూటమి వర్చువల్‌ సమావేశాలు మాత్రమే నిర్వహించగలదు’ అని ఆయన ఎగతాళి చేశారు.  ప్రతిపక్ష `ఇండియా’ కూటమి నేతలందరిదీ రెండు అంశాల ఎజెండా అని నడ్డా విమర్శించారు.

వారి కుటుంబాలను, ఆస్తులను కాపాడుకోవడమే వారికి ముఖ్యమని ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన బీజేవైఎం మీటింగ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశ అభివృద్ధి యువత, రైతులు, మహిళల సాధికరత,  పేదరిక నిర్మూలన కోసం ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం ప్రధాని మోదీని గద్దె దించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆయన మండిపడ్డారు.

కరుణానిధి, ప్రకాశ్‌సింగ్‌ బాదల్ ఇప్పుడు లేరని, వాళ్లు ఎల్లప్పుడూ తమ పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసమే ఆరాటపడ్డారని జేపీ నడ్డా ఆరోపించారు. ఇప్పుడు మమతాబెనర్జి, శరద్‌పవార్‌, ఫరూఖ్‌ అబ్దుల్లా, ఎంకే స్టాలిన్‌ తదితరులు కూడా తమ వారసుల కోసమే తాపత్రయపడుతున్నారని విమర్శించారు. 

ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ తన భార్య, లోక్‌సభ సభ్యురాలు డింపుల్‌ యాదవ్‌ రాజకీయ భవిష్యత్ కోసం ఆరాటపడటం లేదా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతల్లో చాలామందిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ వారంతా సీబీఐ, ఈడీ దర్యాప్తులను ఎదుర్కొంటున్నారని నడ్డా తెలిపారు.  పైగా ఆ అవినీతిపరులంగా దర్యాప్తు సంస్థలపైనే దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ కూడా బెయిల్‌పై బయట తిరుగున్నారని ఆయన గుర్తు చేశారు.