మళ్లీ బీజేపీలో చేరిన అరవిందర్ లవ్లీ

ఢిల్లీ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు అరవిందర్ లవ్లీ మళ్లీ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ్‌ సమక్షంలో ఆయన మరోసారి బీజేపీ గూటికి చేరుకున్నారు. అరవిందర్ లవ్లీతోపాటు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు రాజ్ కుమార్ చౌహాన్, నసీబ్ సింగ్, నీరజ్ బసోయా, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అమిత్ మల్లిక్ కూడా బీజేపీలో చేరారు.

కాగా, ఢిల్లీ కాంగ్రెస్‌ చీఫ్‌గా రెండోసారి వైదొలగిన అరవిందర్ లవ్లీ, బీజేపీలో చేరబోనని తెలిపారు. టికెట్ల పంపిణీపై మనస్తాపానికి గురైన ఆయన కాంగ్రెస్ చీఫ్‌ పదవికి రాజీనామా చేసినట్లు వచ్చిన వదంతులను ఖండించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) మంత్రులు అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీతో కాంగ్రెస్‌ పార్టీ పొత్తుపెట్టుకోవడాన్ని అరవిందర్ లవ్లీ తప్పుపట్టారు. 

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఈ మేరకు లేఖ రాశారు. మరోవైపు 2015లో కూడా ఢిల్లీ కాంగ్రెస్‌ చీఫ్‌ పదవి నుంచి అరవిందర్ లవ్లీ వైదొలగారు. 2017లో బీజేపీలో చేరిన ఆయన తొమ్మిది నెలల తర్వాత తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారు. అయితే లోక్‌సభ ఎన్నికల వేళ మరోసారి ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్‌ పదవి నుంచి తప్పుకున్న అరవిందర్ లవ్లీ మళ్లీ బీజేపీలో చేరారు.