ఆహారంలో పురుగులు….ఆందోళ‌నలో జెఎన్టీయు విద్యార్దునులు

హైదరాబాద్ జేఎన్‌టీయూ కాలేజీ మెస్‌లో ఆహారం సరిగా లేదని విద్యార్థినులు ధ‌ర్నాకు దిగారు. వ‌ర్శిటీ గేటు వ‌ద్ద బైఠాయించి ప్రిన్సిపాల్ కు వ్య‌తిరేకంగా నినాదాల చేశారు. ఈ సంద‌ర్భంగా జేఎన్ టీయూ పీజీ విద్యార్థులు మాట్లాడుతూ తినే ఆహారంలో పురుగులు, బొద్దింకలు, వైర్లు, గాజు ముక్కలు వస్తున్నాయని ఆరోపించారు. 
 
కళాశాలకు కొత్త ప్రిన్సిపాల్ వచ్చినప్పటి నుంచి భోజనం సక్రమంగా అందడం లేదని మండిపడ్డారు.  విద్యార్థుల సమస్యలపై పలుమార్లు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఫిర్యాదు చేసిన వారిపైనే ప్రిన్సిపాల్‌ దాడులు చేస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  న్యాయం కోసం వెళితే సాయంత్రం 6 గంటలలోపు మెస్‌ తలుపులు మూసేస్తామని ప్రిన్సిపాల్‌ బెదిరిస్తున్నారని విద్యార్థులు విమర్శిస్తున్నారు.
త‌క్ష‌ణం త‌మ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరారు. విద్యార్థులు ఎక్కడికి వెళ్లినా ఎందుకు వెళ్తున్నారు? కాలేజీలో ఎక్కడపడితే అక్కడ కూర్చోవడం దేనికి అని అడుగుతున్నారని పేర్కొన్నారు.  హాస్టల్ మెస్ సరిగా లేదని, మెస్‌లోనే లైటింగ్‌ లేక చీకట్లో భోజనం చేయాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. ప్రిన్సిపాల్‌ని ప్రశ్నించగా `మీ కోసం ఇంద్ర భవనం కట్టలే’మని హేళనగా చెబుతున్నారని పీజీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఎక్కువ మాట్లాడితే హాస్టల్ ఖాళీ చేయిస్తానని ప్రిన్సిపాల్ బెదిరిస్తున్నాడని విద్యార్థులు వాపోయారు.

ఉస్మానియా విద్యార్ధినులు ధ‌ర్నా
మరోవైపు ఓయూ విద్యార్ధినులు సైతం ఆందోళ‌న చేప‌ట్టారు. విద్యార్థులు ఓయూ గేట్లను మూసివేసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రాత్రి పూట కొందరు దండగులు గది డోర్ లు కొడుతున్నారని, ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో నిరసన చేప‌ట్టామ‌ని అంటున్నారు. 
దీనిపై హాస్ట‌ల్ విద్యార్ధినులు మాట్లాడుతూ, ఓయూ లేడీస్ హాస్టల్‌లో రాత్రిపూట కొందరు దుండగులు గది తలుపులు కొడుతున్నారని, దీంతో భ‌యాందోళనకు గురవుతున్నామని పేర్కొన్నారు.

లేడీస్ హాస్టల్ వైపు రాత్రి పూట ఏం జరుగుతుందో అని భయాందోళనకు చెందుతున్నామని తెలిపారు. హాస్టల్‌లో సరైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వీసీ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలపై స్పందించి వారికి సరైన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.