పరిశ్రమల వృద్ధి, హెరిటేజ్‌లో అగ్రగామి హైదరాబాద్‌

పరిశ్రమల వృద్ధి, హెరిటేజ్‌లో హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉన్నదని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ తెలిపారు. చంద్రయాన్‌-3 దేశం మొత్తం గర్వించేలా చేసిందని చెబుతూ పరాజయాలను అధిగమించి మూడు ప్రాజెక్టుల్లో విజయాను సాధించామని చెప్పారు. 
 
జేఎన్‌టీయూ హెచ్‌ కాన్వకేషన్‌కు ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్సిటీ వైస్ ఛాన్సలర్ నరసింహా రెడ్డి ఇస్రో చైర్మన్‌కు గౌరవ డాక్టరేట్‌ అందించారు. అనంతరం సోమనాథ్‌ మాట్లాడుతూ వర్సిటీలతో కలిసి పనిచేయడంపై వీసీతో చర్చించానని చెప్పారు. తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.
 
అంతరిక్ష రంగం ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకర్షిస్తుందని, అందుకే చంద్రయాన్-3పై ఎంతో ఆసక్తి నెలకొందని తెలిపారు. ఎంతోమందికి చంద్రయన్ 3 ప్రయోగం ఉపయోగం గురించి మొత్తం తెలియకపోవచ్చు, అయినా ఈ ప్రయోగం అందరిని ఎంతో గుర్వించేలా చేసిందని ఆయన గుర్తు చేశారు. గత 60 ఏళ్లుగా ఇస్రో ఎంతో కృషి చేస్తోందని వివరించారు.
 
అంతరిక్ష రంగంలో మరిన్ని అంకురాలు, పరిశ్రమలు రావాలని చెప్పారు. తన జీవితంలో ఎన్నో పరాజయాలు చూశానని పేర్కొంటూ పరాజయం పొందినప్పుడు ఎవరు మిమ్మల్ని పట్టించుకోరని స్పష్టం చేశారు. తన జీవితంలో రాకెట్‌ రూపకల్పనలో ఎన్నో తప్పులు చేశానని చెబుతూ అపజయం గెలుపునకు పాఠం లాంటిదని తెలిపారు.