ఏసీబీకి చిక్కిన కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్

వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఏసీబీ ట్రాప్ కలకలం రేపింది. రూ.50 వేలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిష్టయ్య ఏసీబీకి చిక్కాడు. తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద యూనివర్సిటీగా పేరొందిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో వివిధ మెస్ లకు పాలు సరఫరా చేస్తున్న వ్యాపారి నుంచి పాల బిల్లుల చెల్లింపులకు గతంలో చిన్న మొత్తంలో లంచం తీసుకొన్న కిష్టయ్య , ప్రతి సారి బిల్లు పాస్ చేయడానికి 5శాతం లంచం కోరుతున్నాడు.
దీంతో విసిగిపోయిన పాలవ్యాపారి ఏసీబీని ఆశ్రయించాడు, ఏ.అర్ కిష్టయ్య పైఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా హన్మకొండ ఏసీబీ అధికారులు పథకం ప్రకారం రచించారు.  బాధితుడు తెలిపిన ప్రకారం గత నాలుగు సంవత్సరాల నుంచి కాకతీయ యూనివర్సిటీలోని హాస్టళ్లకు రాజేందర్​ అనే ప్యాపారి పాలు సరఫరా చేస్తున్నాడు.
కానీ కొంతకాలంగా ఆయనకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో దాదాపు రూ.19 లక్షల వరకు బిల్లులు పెండింగ్​ లో పడ్డాయి. వాస్తవానికి హాస్టల్​ అధికారులు పంపిన బిల్లు మేరకు ఆడిట్​ సెక్షన్​ అధికారులు అప్రూవ్​ చేస్తే సదరు పాల వ్యాపారికి బిల్లులు జమ అయ్యే అవకాశం ఉంది. కానీ హాస్టల్​, ఆడిట్​ సెక్షన్​ అధికారులు ఆయనకు డబ్బులు రిలీజ్​ చేయకుండా పెండింగ్​ లో పెట్టారు. 

 చివరకు రాజేందర్​ కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్​ శ్రీనివాస్​ రావు దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళ్లారు. అయన కూడా పట్టించుకోలేదు. పాల వ్యాపారికి మొత్తంగా రూ.19 లక్షల వరకు బిల్లులు పెండింగ్​ పడగా  ఆ బిల్లు విడుదల​ చేయడానికి ఆడిట్​ సెక్షన్​ అధికారి, అసిస్టెంట్ రిజిస్ట్రార్​ కిష్టయ్య రూ.70 వేలు డిమాండ్​ చేశారు. 

కానీ అంత మొత్తం ఇవ్వలేనని, రాజేందర్​ పలుమార్లు బ్రతిమాలుకున్నాడు. దీంతో చివరకు రూ.50 వేలు ఇవ్వాల్సిందిగా ఏఆర్​ కిష్టయ్య ఖరాకండీగా తేల్చి చెప్పాడు.  దీంతో తీవ్ర మనోవేదనకు గురైన రాజేందర్​ డబ్బులు ఇచ్చే స్తోమత లేక ఏసీబీ డీఎస్పీ సాంబయ్యను సంప్రదించాడు.

ఇదిలాఉంటే పాల బిల్లు క్లియర్​ చేసేందుకు శుక్రవారం డబ్బులతో రావాల్సిందిగా ఏఆర్​ కిష్టయ్య సూచించిన మేరకు రాజేందర్​ రూ.50 వేలు తీసుకుని వెళ్లాడు.  అప్పటికే అక్కడికి చేరుకున్న ఉన్న ఏసీబీ డీఎస్పీ సాంబయ్య, ఇతర అధికారులు రాజేందర్​ నుంచి ఏఆర్​ కిష్టయ్య డబ్బులు తీసుకుంటుండగా రెడ్​ హ్యాండెడ్​ గా పట్టుకున్నారు. అనంతరం కేయూ ఆడిట్​ సెక్షన్​ లో సోదాలు నిర్వహించారు. కిష్టయ్యను విచారించి, వివరాలు రాబట్టే పనిలో పడ్డారు.