పాల‌మూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు 60 శాతం నిధులు

పాల‌మూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా క‌ల్పించాల‌ని జ‌ల్ శ‌క్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావ‌త్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. క‌ర‌వు, ఫ్లోరైడ్ పీడిత జిల్లాలైన నాగ‌ర్‌క‌ర్నూల్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, వికారాబాద్‌, నారాయ‌ణ‌పేట, రంగారెడ్డి, న‌ల్గొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎక‌రాల‌కు పాల‌మూరు- రంగారెడ్డి ఎత్తిపోత‌ల నుంచి సాగు నీరు ఇవ్వాల్సి ఉంద‌ని తెలిపారు. 
 
ఈ ప్రాజెక్టు నుంచి ఆరు జిల్లాల ప‌రిధిలోని 1226 గ్రామాల‌తో పాటు హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రానికి తాగు నీరు స‌ర‌ఫ‌రా చేయాల్సి ఉంద‌ని చెప్పారు. ప్రాజెక్టు ప్రాధాన్యం దృష్ట్యా పాల‌మూరు- రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌కు జాతీయ హోదా ఇవ్వాల‌ని కోరారు.  ఇప్పటికే పలు అనుమతులు మంజూరయ్యాయని, మిగిలిన వాటిని కూడా త్వరితగతిన మంజూరు చేయాలని కోరారు.
హైడ్రాలజి, ఇరిగేషన్ ప్లానింగ్, అంచనా వ్యయం, బిజి రేషియో, అంతర్‌రాష్ట్ర అంశాలు కేంద్ర జలసంఘం పరిశీలనలో ఉన్నాయని, వాటికి వెంటనే ఆమోదం తెలపాలని  రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రిని కోరారు. ఇందుకు సంబంధించిన వినతిపత్రం అందజేశారు. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో కృష్ణానదీ నుంచి 90టీఎంసీల నీటిని ఎత్తిపోయటం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యంగా తెలిపారు. దీనికి కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు కూడా కోరామని వెల్లడించారు.
 
రేవంత్ రెడ్డి విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి 2014 త‌ర్వాత కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా క‌ల్పించ‌లేద‌ని, ఈ విధానం ప్రస్తుతం అమ‌లులో లేద‌ని చెప్పారు. అయితే పాల‌మూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్రాధాన్యం దృష్ట్యా ఆ ప్రాజెక్టుకు తమ శాఖ ప‌రిధిలోని వివిధ పధకాల కింద 60 శాతం నిధులు కేటాయిస్తామ‌ని హామీ ఇచ్చారు. 
 
ఇదే విషయాన్ని సాగునీటి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. అదనపు నిధుల కేటాయించేందుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సానుకూలంగా స్పందించారని చెప్పారు.