తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రతపై మరోసారి చర్చించండి

తిరుమల నడక మార్గంలో వన్యమృగాల దాడుల నుంచి శ్రీవారి భక్తులను కాపాడేందుకు తీసుకునే దీర్ఘకాలిక చర్యలపై చర్చించేందుకు రాష్ట్ర అటవీ శాఖ, టిటిడి, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ)లకు సంబంధించిన అధికారులు మరోసారి సమావేశమై చర్చించాలని హైకోర్టు స్పష్టం చేసింది. 

వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరిగేందుకు ఎక్కడెక్కడ అండర్ పాస్లు, ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలి? భక్తుల భద్రత కోసం ఎంతమేర ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్న విషయాలు డబ్ల్యూఐఐ ఇచ్చిన నివేదికలో స్పష్టంగా లేవని ఆక్షేపించింది.  తాజాగా నిర్వహించబోయే సమావేశం అనంతరం భక్తుల భద్రత కోసం తీసుకునే నిర్ణయాలను అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని టిటిడి ఈవోను ఆదేశించింది. 

పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని చెబుతూ విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్.రఘునందన్ రావులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 

వన్యప్రాణుల దాడుల నుంచి భక్తులను కాపాడేందుకు తిరుపతిలోని అలిపిరి నుంచి తిరుమల వరకు నడక దారిలో ఇరువైపులా ఇనుప కంచె (ఫెన్సింగ్) ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం, టిటిడి, అటవీ శాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ టిటిడి బోర్డు పూర్వ సభ్యుడు జి.భానుప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

బుధవారం జరిగిన విచారణలో అటవీ శాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది ఖాసిం సాహెబ్ వాదనలు వినిపిస్తూ డబ్ల్యూఐఐ ఇచ్చిన నివేదికను కోర్టు ముందు ఉంచామని పేర్కొన్నారు. పిటిషనర్ తరపున న్యాయవాది బాలాజీ వడేరా వాదనలు వినిపిస్తూ. నుప కంచె, అండర్ పాస్లు ఏర్పాటు చేయాలని డబ్ల్యూఐఐ నివేదిక ఇచ్చిందని తెలిపారు. 

టిటిడి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ చిరుత దాడిలో మరణించిన చిన్నారి కుటుంబానికి టిటిడి తరపున రూ.10 లక్షలు, ప్రభుత్వం తరపున రూ.5 లక్షల పరిహారం అందజేశారని వెల్లడించారు. డబ్ల్యూఐఐ నివేదిక అమలుకు ఆరు నెలల సమయం పడుతుందని చెప్పారు. భక్తుల భద్రత కోసం టిటిడి తాత్కాలిక చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. దానికి ధర్మాసనం స్పందిస్తూ డబ్ల్యూ ఐఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా మీ కార్యాచరణ ఏమిటని ప్రశ్నించింది. మరోసారి సమావేశమై ఓ నిర్ణయానికి రావాలని స్పష్టం చేసింది.