కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిల

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ షర్మిల  తెలంగాణ గడ్డపై సొంతంగా ఏర్పాటు చేసిన  వైఎస్సాఆర్‌ తెలంగాణ పార్టీని గురువారం కాంగ్రెస్ లో విలీనం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన విలీన కార్యక్రమంలో ఖర్గే, రాహుల్ ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

వైఎస్సార్‌ టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా షర్మిల చెప్పారు. నేటి నుంచి కాంగ్రెస్‌లో వైటీపీ ఒక భాగమని చెబుతూ దేశంలోనే అతిపెద్ద పార్టీ కాంగ్రెస్‌ అని తెలిపారు. దేశంలో అన్ని వర్గాలను న్యాయం చేసే పార్టీ అని ఆమె వెల్లడించారు. తన తండ్రి వైఎస్సార్‌ తన జీవితమంతా కాంగ్రెస్‌ కోసమే పనిచేశారని ఆమె గుర్తు చేశారు.

నాన్న అడుగు జాడల్లోనే నడుస్తున్నాని పేర్కొంటూ రాహుల్‌ గాంధీని ప్రధానిగా చూడటం తన తండ్రి కల అని తెలిపారు. రాహుల్‌ జోడో యాత్ర వల్ల కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వచ్చిందని చెప్పారు.  జోడో యాత్ర ప్రజలతోపాటు తనలో కూడా విశ్వాసాన్ని నింపిందని చెబుతూ కాంగ్రెస్‌ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఎన్నికల్లో పోటీ చేయలేదని ఆమె స్పష్టం చేశారు.

తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీని స్థాపించారు. తెలంగాణలో అధికారం కోసం సుదీర్ఘ పాదయాత్ర కూడా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పాలేరు నుంచి బరిలోకి దిగుతానని ప్రకటించిన షర్మిల, అనుహ్యంగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి ఆమె షాకిచ్చారు. 

ఇలా  ఉండగా, మొదట మల్లికార్జున ఖర్గే షర్మిల భర్త బ్రదర్ అనిల్‌కు కండువా కప్పడానికి వెళ్లగా దాన్ని ఆయన నిరాకరించారు. ఆ తరువాత రాహుల్ గాంధీకి సైతం చేదు అనుభవమే ఎదురైంది. కేవలం షర్మిల మాత్రమే పార్టీలో చేరుతున్నారని చెప్పి బ్రదర్ అనిల్ కాంగ్రెస్ నాయకులకు గట్టి షాకే ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.