భూ హక్కుల చట్టం అమల్లోకి రాలేదన్న ఏపీ ప్రభుత్వం

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని అమల్లోకి రాలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఆస్తి వివాదాలకు సంబంధించి దాఖలయ్యే దావాలను తిరస్కరించరాదని సివిల్‌ కోర్టులను ఆదేశించింది.  కక్షిదారులు దాఖలు చేసే దావాలను విచారణ చేపట్టాల్సిందేనని కూడా తేల్చి చెప్పింది.
ఈ మేరకుచీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది.  ఈలోగా ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శిలు కౌంటర్లు దాఖలు చేయాలంది.
ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని సవాల్‌ చేస్తూ ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలూ), రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌, కర్నూల్ జిల్లా న్యాయవాదుల సంఘం తరుపున వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను హైకోర్టు విచారణ చేపట్టింది. 
 
పిల్స్‌ విచారణకు రాగానే, ప్రభుత్వ ప్లీడర్‌ కల్పించుకుని, భూయాజమాన్య హక్కు చట్టానికి సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం ఖరారు చేయలేదని చెప్పారు. రాష్ట్ర సర్కార్‌ నూతనంగా తెచ్చిన భూ యజమాన్య హక్కుల చట్టం ప్రజల హక్కులను హరించేలా ఉందని పిటీషన్ల తరపు న్యాయవాదులు వాదించారు. 
 
కొత్త చట్టం అమల్లోకి రావడంతో స్థిరాస్తి వివాదాలపై దాఖలయ్యే దావాలను సివిల్‌ కోర్టులు విచారణ చేపట్టడం లేదని పేర్కొన్నారు. కొత్త చట్ట నిబంధనల ప్రకారం దావాల్లోని వివాదాలను సంబంధిత అధికారుల వద్ద తేల్చుకోవాలని సివిల్‌ కోర్టులు చెబుతున్నాయని పేర్కొన్నారు.  అయితే, పిటిషనర్ల వాదనలను ఏజీ ఎస్‌ శ్రీరామ్‌ వ్యతిరేకించారు.
భూ యాజమాన్య హక్కుల చట్టంలోని సెక్షన్‌ 4 ప్రకారం ఆయా ప్రాంతాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌కు నోటిఫికేషన్‌ ఇవ్వలేదని తెలిపారు. నోటిఫికేషన్‌ జారీకి గడువు ఉందని, నిబంధనల రూపకల్పన కూడా కాలేదని చెప్పారు.  టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి (టీఆర్‌వో), ల్యాండ్‌ టైట్‌లింగ్‌ అప్పిలెట్‌ అధికారులను (ఎల్‌టీఏవో) కూడా నియమించలేదని చెప్పారు.
ఈ నేపథ్యంలో సివిల్‌ కోర్టు దావాల్ని తిరస్కరించాల్సిన అవసరం కూడా లేదని వివరించారు.  ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకును హైకోర్టు విచారణను వచ్చే నెల 7కి వాయిదా వేసింది. అప్పటి వరకు తామిచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయని, సివిల్‌ కోర్టులు దావాలను చట్ట ప్రకారం విచారణ చేయాల్సిందేననితేల్చి చెప్పింది.