నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత ముహమ్మద్‌ యూనస్‌కు జైలు

బంగ్లాదేశ్‌ కార్మిక చట్టాలను ఉల్లంఘించారంటూ నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, ప్రొఫెసర్‌ ముహమ్మద్‌ యూనస్‌ (83)ను కోర్టు సోమవారం దోషిగా నిర్ధారించింది. యూనస్‌తో పాటు ఆయన సంస్థ ‘గ్రామీణ టెలికామ్‌’లో పనిచేస్తున్న ముగ్గురు సహోద్యోగులకు కూడా ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించినట్లు ప్రాసిక్యూటర్‌ ఖుర్షీద్‌ అలామ్‌ ఖాన్‌ మీడియాకి తెలిపారు.

కార్మిక చట్టాలను 83 ఏళ్ల యూనుస్ ఉల్లంఘించారన్న ఆరోపణలు నిరూపితమయ్యాయని, ఆరు నెలల సాధారణ లేదా కఠిన కారాగార శిక్ష అనుభవించాలని కార్మిక న్యాయస్థానం జడ్జి షేక్ మెరీనా సుల్తానా ప్రకటించారు. అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్న నలుగురికి వెంటనే బెయిల్‌ మంజూరు చేశారు. యూనస్‌, ఆయన సహచరులు గ్రామీణ టెలికాం కంపెనీలో కార్మికుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని, ఇది కార్మిక చట్టాలను ఉల్లంఘించడమేనని ప్రభుత్వం వాదిస్తోంది. 

కార్మిక చట్టాల ఉల్లంఘన కేసుతో పాటు అవినీతికి సంబంధించి సుమారు 100 ఆరోపణలు యూనస్‌ ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఆరోపణలను వారు ఖండించారు. బంగ్లాదేశ్‌లో తాను స్థాపించిన 50కి పైగా వ్యాపార సంస్థల్లో ఏ సంస్థ నుండి లాభం పొందలేదని యూనస్‌ గతంలో వివరణనిచ్చారు. అవి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు. ఈ కేసు తప్పుడు, రాజకీయ ప్రేరేపితమైనదని యూనస్ తరుపు న్యాయవాదులు  పేర్కొన్నారు. ఆయనను వేధించడం, అవమానించడమే ఈ కేసు ఏకైక లక్ష్యమని విమర్శించారు.

గ్రామీణ్ టెలికం అనే సామాజిక వాణిజ్య కంపెనీని స్థాపించడం ద్వారా పేద ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థను చేరువ చేయడంలో యూనుస్ పముఖ పాత్ర పోషించారు. మైక్రోఫైనాన్స్‌లో బంగ్లాదేశ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కల్పించారు. యూనస్‌పై కొనసాగుతున్న న్యాయపరమైన వేధింపులను ఖండిస్తూ గతేడాది ఆగస్టులో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, ఐరాస మాజీ సెక్రటరీ జనరల్‌ బాన్‌ కీ మూన్‌ సహా 160 మంది ప్రముఖులు సంయుక్తంగా ఓ లేఖను విడుదల చేశారు.

ఆయన భద్రత, స్వేచ్ఛపై ఆందోళన చెందుతున్నామంటూ సుమారు 100కి పైగా నోబెల్‌ బహుమతి గ్రహీతలు పేర్కొన్నారు.  ప్రధాని షేక్‌ హసీనా ప్రభుత్వం తీసుకున్న రబ్బర్‌ స్టాంప్‌ నిర్ణయాలను బంగ్లాదేశ్‌ కోర్టులు అనుసరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రజలలో యూనస్‌ పట్ల ఉన్న ప్రజాదరణను, రాజకీయ అసమ్మతిని అణచివేసేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

యూనస్‌పై క్రిమినల్‌ చర్యలు ఆయనపై అసమ్మతికి, రాజకీయ ప్రతీకారానికి చిహ్నమని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ పేర్కొంది. ఆయనపై వేధింపులకు తక్షణమే ముగింపు పలకాలని గతేడాది సెప్టెంబర్‌లో పిలుపునిచ్చింది.