ప్రపంచవ్యాప్తంగా కోవిషీల్డ్ టీకా ఉపసంహరణ

కోవిషీల్డ్ కోవిడ్ వ్యాక్సిన్లను ప్రపంచ మార్కెట్‌ల నుంచి బ్రిటిష్ ఫార్మాస్యూటికల్స్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా ఉపసంహరించుకుంది. తాము అభివృద్ధి చేసిన కరోనా టీకా వేసుకున్నవారిలో అరుదైన దుష్ప్రభావాలు తలెత్తుతాయని స్వయంగా ఆస్ట్రాజెనెకా అంగీకరించినట్టు నివేదికలు వెలువడిన కొద్ది రోజుల్లో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 
 
కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా రూపొందించిన కోవిషీల్డ్ టీకా వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు సహా వివిధ దేశాల న్యాయస్థానాల్లో కేసులు.. వంటి పరిణామాల నేపథ్యంలో వ్యాక్సిన్ అమ్మకాలపై బ్రిటిష్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

వాణిజ్యపరమైన కారణాలతోనే వ్యాక్సిన్లు ఉఫసంహరించుకున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. వాణిజ్య కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న డోస్‌ల ఉపసంహరణ ప్రారంభించినట్టు ఆస్ట్రాజెనెకా వెల్లడించిందని ది టెలిగ్రాఫ్ నివేదించింది. కొత్త వేరియంట్‌లను ఎదుర్కొనేలా వ్యాక్సిన్‌లను సిద్ధం చేసినట్టు ఆస్ట్రాజెనెకా పేర్కొంది.

 
యూరోపియన్ యూనియన్‌లో మార్కెటింగ్ నుంచి స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్న ఆస్ట్రాజెనెకా ఇకపై ఈ టీకా తయారీ, వినియోగాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ టీకాను వినియోగిస్తున్న ఇతర దేశాల మార్కెట్‌ల నుంచి కూడా ఉపసంహరించుకోనుంది. 
 
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా మరణాలు, ఆరోగ్య సమస్యల తలెత్తాయనే ఆరోపణలపై యూకే కోర్టులో 100 మిలియన్ పౌండ్ల దావాను ఆ సంస్థ ఎదుర్కొంటోంది.  కోవిషీల్డ్ తీసుకునేవారిలో అరుదైన సందర్భాల్లో థ్రాంబోసిస్‌తో థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్‌ (టిటిఎస్)కు కారణమవుతుందని ఇటీవల కోర్టుకు సమర్పించిన అఫిడ్‌విట్‌లో ఆస్ట్రాజెనెకా అంగీకరించింది.
 
రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గిపోవడం టీటీఎస్ కారణమవుతుంది. యూకేలో దీని కారణంగా కనీసం 81 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, కోర్టు కేసులతోనే వ్యాక్సిన్‌ను ఉపసంహరించుకున్నారనే వాదనలను ఆ సంస్థ తోసిపుచ్చింది. 
 
‘స్వతంత్ర నివేదిక ప్రకారం.. కోవిషీల్డ్ టీకా అందుబాటులోకి వచ్చిన తొలి ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్ డోస్‌లను సరఫరా చేసి 6.5 మిలియన్ల మందికిపైగా ప్రాణాలను రక్షించాం. మా ప్రయత్నాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు గుర్తించాయి. ప్రపంచ మహమ్మారిని అంతం చేయడంలో కీలకమైన అంశంగా పరిగణించాయి’ అని తెలిపింది. 
 
పైగా, `పలు వేరియంట్‌లను తట్టుకునేలా అభివృద్ధిచేసి, ఆధునీకరించిన టీకాలలో మిగులు ఉంది. కరోనా మహమ్మారి నియంత్రణలో సహకారం అందించడానికి మేము మా భాగస్వాములతో కలిసి పని చేస్తాం’ అని ఆస్ట్రాజెనెకా ప్రకటన చేసింది. కోవిషీల్డ్ ఉపసంహరణ గురించి ఈ ఏడాది మార్చి 5న లండన్ హైకోర్టుకు వెల్లడించి, మే 7 నుంచి ఇది అమలులోకి వస్తుందని పేర్కొంది. కానీ, టీకా దుష్ప్రభావాలే కారణమని తెలుస్తోంది.