రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి పుతిన్​ బాధ్యతలు స్వీకారం

రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి బాధ్యతలు చేపట్టారు వ్లాదిమిర్​ పుతిన్​. మంగళవారం క్రెమ్లిన్​ హాల్​లో ఈ వేడుక ఘనంగా జరిగింది. ప్రత్యర్థులను కనుమరుగు చేసిన పుతిన్​, దేశంలోని అన్ని అధికారాలను హస్తగతం చేసుకుని మరింత శక్తిమంతంగా మారిపోయారు. త‌న వ‌ర్క్ ఆఫీసు నుంచి ప్ర‌త్యేక కారు రైడ్‌లో 71 ఏళ్ల పుతిన్ క్రెమ్లిన్ ప్యాలెస్‌కు వెళ్లారు.

రాజ్యాంగానికి చెందిన ఒక ప్ర‌త్యేక కాపీపై ఓ చేయి వేసి దేశానికి సేవ చేయ‌నున్న‌ట్లు ప్ర‌మాణ స్వీకారం చేశారు. 2020లో జ‌రిగిన స‌వ‌ర‌ణ‌ల‌తో కూడిన రాజ్యాంగ పుస్త‌కాన్ని ప్ర‌మాణ స్వీకారం వేళ వినియోగించారు. జాతీయ పార్ల‌మెంట్‌కు చెందిన చ‌ట్ట‌స‌భ ప్ర‌తినిధులు, న్యాయ‌మూర్తులు ప్ర‌మాణ స్వీకారంలో పాల్గొన్నారు. చీఫ్ జ‌స్టిస్ వ‌లెరి జోర్కిన్ .. పుతిన్ అయిదోసారి అధ్య‌క్ష అభ్య‌ర్థిత్వాన్ని ద్రువీక‌రించారు.

దీంతో మ‌రో ఆరేళ్ల పాటు ర‌ష్యా అధ్య‌క్షుడిగా పుతిన్ కొన‌సాగ‌నున్నారు. 2000, 2004, 2012, 2018 సంవ‌త్స‌రాల్లో పుతిన్ ప్ర‌మాణం చేశారు. ఇప్పటికే దాదాపు పాతిక సంవత్సరాలుగా ఈ పదవిలో కొనసాగుతున్న ఈయన స్టాలిన్​ తర్వాత అత్యధిక కాలం రష్యా అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. పుతిన్​ ప్రస్తుత పదవి కాలం 2030 వరకు ఉంటుంది. ఆ తర్వాత మరోసారి పోటీ చేసేందుకు కూడా పుతిన్​కు అర్హత ఉంది.

“మనం ఐక్యమత్యంతో ఉన్న  గొప్ప వ్యక్తులం. మనం కలిసి అన్ని అడ్డంకులను అధిగమిస్తాము, మనం మన ప్రణాళికలన్నింటినీ ఫలవంతం చేస్తాము.  కలిసి మనం గెలుస్తాము” అని అధ్యక్షుడు పుతిన్ మంత్రులు, ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగిస్తూ చెప్పారు.  అధ్యక్షుడు పుతిన్ “ప్రజాస్వామ్యంను పరిరక్షిస్తాం, అభివృద్ధి చేస్తాం, రష్యాను జాగ్రత్తగా చూసుకొంటాం” అని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.
24 సంవత్సరాల తరువాత, క్రెమ్లిన్ నాయకుడు ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధంలో రష్యా భారీ నష్టాలను చవిచూస్తున్నది. ఈ యుద్ధం నుండి బైట పడటమే ఇప్పుడు ఆయన ముందున్న పెను సవాల్.  పుతిన్ మరో ఆరేళ్లపాటు అధికారంలో ఉండనున్న నేపథ్యంలో యుద్ధానికి నిధులు సమకూర్చడానికి పన్నులను పెంచడం, సైన్యంలో చేరడానికి మరింత మందిని ఒత్తిడి చేయడం వంటి నిర్ణయాలను తీసుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఏడాది మార్చిలో జరిగిన రష్యా అధ్యక్ష ఎన్నికల్లో 87 శాతం ఓట్లతో(దాదాపు 76 మిలియన్ల ఓట్లు) పుతిన్‌ విజయం సాధించారని రష్యా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల ఫలితాల్లో పుతిన్ దరిదాపుల్లోకి ప్రత్యర్థులు రాలేకపోయారు.  న్యూ పీపుల్‌ పార్టీ వ్లాదిస్లవ్‌ డవాంకోవ్‌ కు 4.8శాతం ఓట్లు, కమ్యూనిస్ట్‌ పార్టీకి చెందిన నికోలోయ్‌ ఖరితోనోవ్‌కు 4.1శాతం ఓట్లు, లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన లియోనిడ్‌ స్లట్‌స్కీకి 3.15 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.