మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్‌ అజార్‌ మృతి..!

వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ మృతి చెందినట్లు తెలుస్తోంది. సోమవారం (జనవరి-1) తెల్లవారుజామున 5 గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన బాంబు దాడిలో మసూద్ ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ.. ఈ విషయాన్ని మాత్రం పాకిస్థాన్ అధికారికంగా ధృవీకరించలేదు. భవల్‌పూర్‌ మసీదు నుంచి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై బాంబు విసిరినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అలాగే దాడికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. బాంబు పేలుడు.. ఆ తర్వాత జనం పరుగులు, తొక్కిసలాట జరిగినట్లు కనిపిస్తోంది. పేలుడు జరిగినప్పుడు మసూద్ అజార్ అక్కడే ఉన్నాడని ప్రచారం జరుగుతోంది.
మసూద్‌ అజార్‌.. ఈ టెర్రరిస్టును మనదేశం ఎన్నడూ మర్చిపోదు. ఈ తీవ్రవాదిని విడుదల చేయించడం కోసం 1999లో ఇండియన్ ఏయిర్ లైన్స్ విమానాన్ని హైజాక్ చేశారు. నేరుగా ఆ విమానాన్ని కాందహార్ తరలించారు. అంతేకాకుండా.. 2001 డిసెంబర్ 13 న భారత పార్లమెంట్‌పై దాడి, 2008 ముంబై దాడులు, 2016లో పఠాన్‌కోట్‌ దాడి, 2019 పుల్వామా దాడులకు మసూద్ అజారే కారణం..?
జూలై 5, 2005న అయోధ్యలోని రామజన్మభూమి ఆలయంపై దాడితో సహా భారత్‌పై క్రూరమైన ఉగ్రవాద దాడులకు జైషే మహ్మద్ క్యాడర్‌ను మసూద్ ఉపయోగించుకున్నాడు. జనవరి 3, 2016న ఆఫ్ఘనిస్తాన్‌లోని భారత కాన్సులేట్‌పై దాడికి కూడా మసూద్ నేతృత్వంలోనే జరిగింది. మసూద్.. అల్-ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ మరియు తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌ల సన్నిహిత సహచరుడు కూడా.
పాకిస్తాన్ లోని పంజాబ్‌ రాష్ట్రంలో ఓ విద్యావంతుల కుటుంబంలో జన్మించిన మసూద్ అజహార్‌.. ఆజాదీ కశ్మీర్‌ పేరుతో కొన్నేళ్లుగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. అంతేకాకుండా.. బ్రిటన్‌కు జిహదీని పరిచయం చేసింది అజారే. 2019, మే 1వ తేదీన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.