భారీ భూకంపంతో జపాన్కు ‘సునామీ’ ముప్పు

నూతన ఏడాది తొలి రోజున జపాన్​లో భుకంపం గడగడలాడించింది. జపాన్​లోని నార్త్​ సెంట్రల్​ ప్రాంతంలో సోమవారం నాడు 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఎంత ప్రాణ, ఆస్థి నష్టం జరిగింది? అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కాగా.. తాజా భూకంపం కారణంగా ఆ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. 
 
భారీ అలలు ఇప్పటికే కొన్ని తీర ప్రాంతాలను ఢీకొట్టినట్టు తెలుస్తోంది. వీటి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. జపాన్ పశ్చిమ తీరంలోని ఇషికావా, నైగట, టయోమా రాష్ట్రాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇషికావాలోని నాటో తీర ప్రాంతంలో 5 మీటర్ల ఎత్తుగల అలలు దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. 
 
అదే ఇషికావాలోని వజిమా నగరంలో 1 మీటర్​ ఎత్తున్న అలలు తీరాన్ని తాకినట్టు సమాచారం. ఇక నైగట రాష్ట్రంలోని కషిజావకి నగరంలో 40 సెంటీమీటర్ల ఎత్తుతో అలలు తీరంవైపు దూసుకొచ్చినట్టు అక్కడి మీడియా పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల 35 నిమిషాల ప్రాంతంలో 80 సెంటీమీటర్ల ఎత్తున్న అలలు టయోమా రాష్ట్ర తీర ప్రాంతాన్ని ఢీకొట్టినట్టు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. 

యమగట, హ్యోగో ప్రాంతాలవైపు అలలు దూసుకెళుతున్నట్టు వివరించింది. భూకంపం, సునామీ హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమ తీర ప్రాంతానికి సమీపంలో ఉన్న హొకురికి ఎలక్ట్రిక్​ పవర్​ ప్లాంట్​ సిబ్బంది అప్రమత్తమయ్యారు. న్యూక్లియర్​ పవర్​ ప్లాంట్​లో ఏదైనా సమస్యలు ఉన్నాయా? అన్నది చెక్​ చేస్తున్నట్టు స్పష్టం చేశారు.

 మరోవైపు జపాన్​లో భూకంపం, సునామీ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సునామీ ముప్ప ప్రాంతాల్లోని ప్రజలను వేగంగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జపాన్​ ప్రధాని ఫుమియో కిషిదా తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ భూకంప సంఘటన మార్చి 11, 2011న ఈశాన్య జపాన్‌ను తాకిన వినాశకరమైన భూకంపం.. సునామీని గుర్తుచేస్తుంది.

ఫుకుషిమాలో విస్తృతమైన విధ్వంసం, అణు విధ్వంసానికి దారితీసింది. ఆ విపత్తు చేదు జ్ఞాపకం ఇప్పటికీ చాలా మంది కళ్లముందు మెదలాడుతోంది. తక్షణ ప్రతిస్పందన ఆవశ్యకతను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తుంది. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే.. నివాసితులు అధికారిక మార్గాల ద్వారా సమాచారం ఇవ్వాలని, అధికారులు జారీ చేసిన ఏవైనా భద్రతా సూచనలకు కట్టుబడి ఉండాలని సూచించారు