సరిహద్దులు ఇజ్రాయెల్ నియంత్రణలోనే ఉండాలి

ఇజ్రాయిల్- హమాస్ ల సుమారు మూడు  నెలలుగా జరుగుతున్న యుద్ధం ఇప్పుడప్పుడే ఆగదని, కొన్ని నెలలపాటు కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేయడమే కాకుండా గాజా స్ట్రిప్, ఈజిప్ట్ మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతం ఇజ్రాయెల్ నియంత్రణలోనే ఉండాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు.
 
ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల కారణంగా గాజాలో అమాయక ప్రజలు చనిపోతున్న తరుణంలో కాల్పుల విరమణకు పిలుపునివ్వాలని డిమాండ్లు వస్తున్నా సమయంలో ఆయన ఇటువంటి ప్రకటన చేయడం కలకలం రేపుతోంది. మరోవంక, హమాస్‌ని అంతం చేయాలన్న లక్ష్యంతో వైమానిక దాడులు, గ్రౌండ్ ఆపరేషన్స్‌తో ఇజ్రాయిల్ దూసుకుపోతోంది.

‘‘ఫిలడెల్ఫీ కారిడార్, ఇంకా సరిగ్గా చెప్పాలంటే.. గాజాకు చెందిన దక్షిణాది స్టాపేజ్ పాయింట్ ఇజ్రాయెల్ చేతుల్లో ఉండాలి. అది పూర్తిగా మూసివేయబడాలి. గాజా స్ట్రిప్‌తో పాటు ఇతర ప్రాంతీయ సరిహద్దుల్లో ఈ యుద్ధం ఇంకా కొన్ని నెలలపాటు సాగే అవకాశం ఉంది’’ అని బెంజిమన్ నెతన్యాహు తేల్చి చెప్పారు.  హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 13వ వారంలోకి అడుగుపెట్టిన తరుణంలో ఓ మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఈ యుద్ధం తారాస్థాయికి చేరుకుందని, తాము అన్ని విధాలుగా పోరాడుతున్నామని ఆయన చెప్పారు. 

ఈ యుద్ధంలో విజయం సాధించేందుకు తమకు మరింత సమయం కావాలని పేర్కొంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చెప్పినట్లు ఈ యుద్ధం కొన్ని నెలలు సాగుతుందని పేర్కొన్నారు.ఇదే సమయంలో బెంజిమన్ నెతన్యాహు ప్రత్యక్షంగా ఇరాన్‌కు గట్టి హెచ్చరిక చేశారు.  ఒకవేళ ఈ యుద్ధాన్ని హిజ్బుల్లా మరింత విస్తరింపజేస్తే, అది కలలో కూడా ఊహించని దెబ్బలను ఎదుర్కుంటుందని, ఇరాన్‌ని సైతం విడిచిపెట్టమని హెచ్చరించారు.

హమాస్‌కి మద్దతుగా లెబనాన్‌లోని ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై సరిహద్దులో దాడులు చేస్తున్న నేపథ్యంలో బెంజిమన్ ఈ హెచ్చరిక చేశారు. కాగా.. హిజ్బుల్లా, హమాస్‌కి ఇరాన్ ముందు నుంచే మద్దతు ఇస్తోంది. ఈ రెండు సంస్థలు చేస్తున్న దాడుల వెనుక ఇరాన్ ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పోరులో ఇప్పటి వరకు 21వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

హమాస్ స్థావరాలను ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ ఆర్మీ (ఐడిఎఫ్) దాడులను మరింత ముమ్మరం చేసింది. తాజాగా గాజా స్ట్రిప్‌లోని ఖాన్‌ యూనిస్‌లో హమాస్‌ సొరంగాలపై భీకరదాడులు జరిపినట్లు ఓ నివేదిక పేర్కొంది.  24 గంటల్లో దాదాపు 200 మంది మరణించినట్లు తెలుస్తున్నది.  సెంట్రల్ గాజాలోని నుసిరత్ శిబిరంపై ఐడీఎఫ్‌ వైమానిక దాడులు చేసిందని పాలస్తీనియన్ మెడిక్స్ పేర్కొంది. మరోవంక, సెంట్రల్ గాజాపై ఆదివారం ఇజ్రాయెల్ దాడికి 35 మంది ప్రాణాలు కోల్పోయారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.