ఒడిశాలోని ప్రసిద్ధ పూరి జగన్నాథ ఆలయంలోకి ప్రవేశించే భక్తులు ఇకపై తప్పనిసరిగా డ్రెస్‌కోడ్‌ను పాటించాల్సిందే. జీన్స్, షార్టులు, స్కర్టులు, స్లీవ్‌లెస్ డ్రెసులు ధరిస్తే ఆలయంలోకి ప్రవేశం ఉండదు. ఈ నూతన నిబంధనలు జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో ఆలయ పరిసరాల్లో ఎక్కువ మంది పురుషులు ధోతీలతో, మహిళా భక్తులు చీరలు, సల్వార్ కమీజ్‌లతో కనిపించారు.
12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో ఇకపై భక్తులు సంప్రదాయ వస్త్రధారణతోనే ఆలయ ప్రవేశం చేయాలి. ఆలయ విశిష్టతను కాపాడటానికి ఈ నిబంధనలు తీసుకొచ్చినట్టు అధికారులు చెప్పారు. ఆలయ పరిసరాల్లో గుట్కా, పాన్ మసాలాలు, ప్లాస్టిక్ సంచులను నిషేధించినట్టు వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
అంతేగాక 2024 నూతన సంవత్సరం నుంచి పాలిథిన్, ప్లాస్టిక్ సంచులపై కూడా నిషేధం అమలులోకి వచ్చింది. శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలోకి భక్తులు సంప్రదాయ వస్త్రధారణలో రావాలని, హాఫ్ ప్యాంట్లు, షార్ట్, చినిగిన జీన్స్, స్కర్ట్, స్లీవ్‌లెస్ దుస్తులతో ప్రవేశించరాదని శ్రీ జగన్నాథ్ ఆలయ పాలనా యంత్రాంగం(ఎస్‌జెటిఎ) అధికారి ఒకరు తెలిపారు.
ఈ నిబంధన అమలులోకి రావడంతో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో పురుష భక్తులు ధోవతి, పై వస్త్రంతో, మహిళలు చీరలు, చుడీదార్ దుస్తులతో ఆలయ ప్రవేశం చేశారు. తెల్లవారుజామున 1.40 గంలకే గ్రాండ్ రోడ్డులో భక్తులు బారులు తీరారు. మధ్యాహ్నం 12 గంటల వరకు 1.80 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దివ్యాంగులైన భక్తుల కోసం పోలీసులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయం వెలుపల భక్తుల సౌకర్యార్థం ఎయిర్ కండిషన్డ్ తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేశారు.
సిసి టివి కెమెరాలు, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ పిస్టమ్‌తోపాటు మంచినీరు, శౌచాలయాలు కూడా బయట ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఇదే రోజున రెంట్టింపు సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారని సెంట్రల్ రేంజ్ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆషిష్ కుమార్ సింగ్ తెలిపారు.
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు. మార్కట్ చక్కా నుంచి సింహద్వారం వరకు వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. కాగా..భువనేశ్వర్‌లోని లింగరాజ్ ఆలయంలో కూడా సోమవారం నుంచి పాన్, పొగాకు ఉత్పత్తుల వినియోగంపై నిషేధం అమలులోకి వచ్చింది. 11వ శతాబ్దానికి చెందిన ఈ శివుని గుడిలోకి పొగాకును, తమలపాకులను వినియోగించే భక్తులను అనుమతించడం లేదు.
More Stories
జమిలీ ఎన్నికలపై 31న జేపీసీ రెండో సమావేశం
బిజెపి ఎంపీలపై క్రిమినల్ కేసు కొట్టివేత
8 రోజుల్లో 9 కోట్ల మంది పుణ్యస్నానాలు