సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశగా ఇస్రో

అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో ఆ దిశగా ఒక్కొక్క అడుగు వేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొత్త సంవత్సరం వేళ ప్రయోగించిన ఎక్స్‌పోశాట్ ప్రయోగంలోనూ దానికి సంబంధించిన ఫ్యూయల్ సెల్‌ను నింగిలోకి పంపించింది. 
దాన్ని విజయవంతంగా దిగువ భూ కక్ష్యలో ప్రవేశపెట్టింది.
ఇక కొత్త సంవత్సరం వేళ ఇస్రో పంపించిన ఎక్స్‌పోశాట్‌ ప్రయోగం విజయవంతమైనట్లు ఇప్పటికే ఇస్రో అధికారులు వెల్లడించారు.  ప్రస్తుతం ఎక్స్‌పోశాట్ ద్వారా పంపించిన ఫ్యుయల్‌ సెల్‌ భవిష్యత్తులో స్పేస్‌లో భారత్ నిర్మించబోయే అంతరిక్ష కేంద్రానికి ఇది కీలకం కానుందని ఇస్రో వర్గాలు తెలిపాయి.  ఈ క్రమంలోనే తాజాగా ఇస్రో అంతరిక్షంలో కీలకమైన శక్తివనరుల వినియోగంపై ప్రయోగాలు చేపట్టింది.
ఇందులో భాగంగానే సరికొత్త ఫ్యుయల్ సెల్‌ను సోమవారం విజయవంతంగా దిగువ భూ కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇస్రో పంపించిన ఈ ఫ్యుయల్‌ సెల్‌ టెక్నాలజీని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ డెవలప్ చేసింది.  అంతరిక్షంలో సమర్థవంతమైన సుస్థిర శక్తి వనరును భారత్‌కు అందించేందుకు ఈ ఫ్యూయల్ సెల్ ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. రసాయన శక్తిని నేరుగా ఎలక్ట్రోకెమికల్‌ రియాక్షన్‌తో విద్యుత్‌ శక్తిగా మార్చేందుకు ఈ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 
 
దీని వల్ల సుదీర్ఘ కాలం పాటు అంతరిక్ష కేంద్రానికి ఇది విద్యుత్‌ను సరఫరా చేయగలదని పేర్కొన్నారు. దీంతో భవిష్యత్తులో అంతరిక్షంలో భారత్‌ నిర్మించబోయే స్పేస్‌ స్టేషన్‌ కోసం ఈ ప్రయోగం కీలక ముందడుగు అని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.  అయితే స్పేస్‌లో భారత్‌ సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల ప్రయత్నాలు ప్రారంభించింది. 
 
ఈ క్రమంలోనే ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ స్పేస్ స్టేషన్‌ గురించి మాట్లాడుతూ మరో 10 ఏళ్లలో ఈ స్పేస్‌ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేలా లక్ష్యం పెట్టుకోవాలని ఇస్రో శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం చేశారు.