భారత రత్న పురస్కారానికి 70 వసంతాలు

 వివిధ రంగాల్ విశేషకృషి చేసిన వారిని పద్మపురస్కారాలతో గౌరవించుకుంటాం. అత్యున్నస్థాయి పౌరపురస్కారం భారతరత్నను అందజేస్తాం. అలాంటి భారతరత్న అవార్డుకు ఈ జనవరి 2 తో 70 ఏళ్లు నిండాయి. సరిగ్గా 1954 జనవరి 2 న అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఈ అవార్డును అందజేయడాన్ని ప్రారంభించారు.
 పద్మ పురస్కారాలకు భిన్నంగా భారతరత్న ఎంపిక ఉంటుంది. ఇది ప్రతి ఏటా ప్రకటించాలనే నిబంధనేదీ లేదు. అయితే ఏడాదిలో గరిష్టంగా ముగ్గురికి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. భారతరత్న పొందిన పౌరులు.. ఈ దేశపు 7 వ స్థాయి గౌరవాన్ని పొందుతారు. మొదటి 6 స్థానాల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, మాజీ రాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తర్వాతి స్థానంలో భారతరత్న గౌరవాన్ని అందుకుంటారు.
ఇక ఈ అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి రావి ఆకులను పోలిన సర్టిఫికేట్, పతకాన్ని అందజేస్తారు. దీనిపై ఒక వైపు ప్లాటినంతో చెక్కబడిన సూర్యుని ముద్రను కలిగి ఉంటుంది. కింద హిందీలో భారతరత్న అని రాసి ఉంది. మెడల్ అంచులు కూడా ప్లాటినం లైనింగ్ కలిగి ఉంటాయి. మరోవైపు, అశోక స్తంభం ముద్ర ఉంటుంది. దాని కింద దేవనాగరి లిపిలో ‘సత్యమేవ జయతే’ అని రాసి ఉంటుంది. ఈ అవార్డు కింద ఎలాంటి నగదు ప్రోత్సాహకం ఉండదు. వారికి ఉచిత రైల్వే ప్రయాణ సౌకర్యం, జాతీయ, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం, ప్రోటోకాల్ మర్యాద ఉంది. ఇక ఈ అవార్డును పొందిన వారెవరైనా.. తమ పేరు ముందు ‘భారతరత్న’ అని బహిరంగంగా వ్రాసి ప్రదర్శించకూడదు. కానీ.. తమ లెటర్ హెడ్ లోనూ, విజిటింగ్ కార్డ్ లోనూ ఈ అవార్డు వచ్చినట్లు ప్రకటించుకోవచ్చు.
70 ఏళ్లలో ఇప్పటివరకు 48 మందికి ఈ అవార్డు అందజేశారు. తొలి భారతరత్నగా తమిళనాడు మాజీ సీఎం సీ రాజగోపాలచారీ రికార్డులకెక్కారు. తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్, నోబెల్ బహుమతి గ్రహీత సీవీ రామన్ ను భారతరత్నగా సత్కరించారు. మరణానంతరం 14 మందికి కూడా ఈ అవార్డు అందజేశారు. అయితే మరణానంతరం ఈ అవార్డును ప్రకటించరాదనే నిబంధన ఉన్నా.. 1955 లో దీన్ని సవరించారు.
అందుకే 1992 లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అవార్డు ప్రకటనపై కోర్టుల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా నమోదయ్యాయి. నేతాజీ మరణాన్ని అధికారికంగా ధృవీకరించకుండా ఈ అవార్డును ప్రకటించడంపై న్యాయపోరాటాలు జరిగాయి. ఇటు ఆయన కుటుంబ సభ్యులు కూడా అవార్డును స్వీకరించేందుకు నిరాకరించారు. దీంతో కేంద్రం నేతాజీకి ప్రకటించిన అవార్డును వెనక్కి తీసుకుంది. మరణానంతరం భారతరత్నగా గౌరవించబడిన మొదటి వ్యక్తి.. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి.
ఈ అవార్డు పొందిన అతి పిన్న వయస్కుడిగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ నిలిచారు. 40 ఏళ్ల వయస్సులో 2014 లో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు పొందిన మొదటి గాయని MS సుబ్బులక్ష్మి అలాగే మొదటి నటుడు MG రామచంద్రన్ రికార్డు సృష్టించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ (1991) , మదన్ మోహన్ మాలవీయ (2015) మరణానంతర అవార్డుల ప్రదానం చేశారు. 2019 లో భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. ఇటు భారతరత్న అవార్డును విదేశీయులకు కూడా అందజేశారు. ఫ్రాంటియర్ గాంధీగా పిలువబడే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ కు అందజేశారు.  అలాగే దక్షిణాఫ్రికాకు చెందిన నల్లసూరీడు నెల్సన్ మండేలాతో పాటు.. మదర్ థెరిస్సాకు కూడా భారతరత్న అవార్డు అందజేశారు.