దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన

కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలో ‘హిట్‌ అండ్‌ రన్‌’ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. భారతీయ న్యాయ సంహిత-2023 క్రిమినల్‌ కోడ్‌ చట్టం ప్రకారం హిట్‌ అండ్‌ రన్‌ నేరానికి గరిష్ఠంగా పదేండ్ల జైలు శిక్ష విధించనున్నారు. 
 
ఈ చట్టాన్ని రద్దు చేయాలని లేదా శిక్షను తగ్గించాలని దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు సోమవారం నుంచి మూడు రోజులు ధర్నా ప్రారంభించారు.
ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేస్తుండటంతో సరఫరాలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే ట్రక్కులు కూడా నిలిచిపోవడంతో ఎక్కడ ఇంధన కొరత ఏర్పడుతుందోనని వాహనదారులు భయపడుతున్నారు. 
మరోవంక, పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మె చేస్తుండడంతో చాలా మంది వాహనదారులు పెట్రోల్ బంక్ ల్లో బారులు తీరారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని పలు పెట్రోల్ బంక్ ల్లో భారీగా రద్దీ కనిపిస్తోంది. దీంతో పెట్రోల్ బంక్ ల వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ట్రక్కు డ్రైవర్లు రాస్తారోకోలు, ర్యాలీలతో రోడ్లపైకి చేరుకుంటున్నారు. అయితే ట్రక్కు డ్రైవర్ల నిరసనతో పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే ట్యాంకర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ఇంధన కొరత ఏర్పడుతుందనే భయాలు నెలకొన్నాయి. 
 
మహారాష్ట్ర, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, జమ్మూ కాశ్మీర్‌, లద్దాఖ్‌ వంటి రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల ముందు భారీగా వాహనాలు క్యూ కట్టాయి. కొన్ని చోట్ల అయితే బంకుల వద్ద వందల మీటర్ల వరకు వాహనాలు బారులు తీరాయి. వీటికి సంబంధించిన వీడియోలను స్థానికులు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారుతున్నాయి. 
 
ట్రక్కు డ్రైవర్ల ఆందోళనలతో కొన్ని ప్రాంతాల్లో వంట గ్యాస్ సిలిండర్లు సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. అయితే ట్రక్కు డ్రైవర్ల ఆందోళనల కారణంగా ఇంధన సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చాలా రాష్ట్రాలు అనేక ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నాయి.
 
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన భారత న్యాయ సంహిత చట్టంలోని నిబంధన ప్రకారం.. హిట్ అండ్ రన్ కేసుల్లో పదేళ్ల జైలు శిక్ష, రూ.7 లక్షల వరకు ఫైన్ వేయనున్నట్లు కొత్త నిబంధన తీసుకువచ్చింది.  రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన జరిగిన తర్వాత దాని గురించి పోలీసులకు చెప్పకుండా పారిపోతే గరిష్ఠంగా ఈ శిక్ష విధించాలని చేర్చారు.
 
పాత సెక్ష‌న్ ప్ర‌కారం అనూహ్య ప‌రిస్థితిల్లో ప్ర‌మాదం జ‌రిగితే కేవ‌లం రెండేళ్ల జైలుశిక్ష మాత్ర‌మే ఉండేది. కొత్త చ‌ట్టంలో జైలుశిక్ష‌ 10 ఏళ్ల వరకు పెంచడాన్ని నిర‌సిస్తూ ట్ర‌క్కు డ్రైవ‌ర్లు దేశ‌వ్యాప్తంగా ధ‌ర్నా చేప‌డుతున్నారు.
ఈ కొత్త నిబంధనపై ట్రక్కులు, లారీలు, ప్రైవేటు బస్సు డ్రైవర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ నిబంధన వల్ల కొత్త వారు ఈ వృత్తిని చేపట్టేందుకు ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రమాదం జరిగినా కట్టడానికి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నిస్తున్నారు. అన్ని సంవత్సరాల జైలు శిక్ష ఎలా విధిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.