రామ మందిరంలో పూజలందుకోనున్న ‘రామ్ లల్లా’ విగ్రహం ఇదే

* కన్నడ శిల్పి యోగిరాజ్ అరుణ్ విగ్రహం
 
అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠాపనకు విగ్రహ ఎంపిక ఖరారైనట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కర్నాటకకు చెందిన ప్రముఖ శిల్పి యోగిరాజ్ అరుణ్ చెక్కిన శ్రీరాముడి విగ్రహాన్ని అయోధ్యలోని నూతన రామా మందిరంలో ప్రతిష్ఠించనున్నారు.ఆ విగ్రహం ఫొటోను ప్రహ్లాద్ జోషి ట్విటర్ లో పోస్ట్ చేశారు.

మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన శ్రీరాముడి విగ్రహాన్ని అయోధ్యలోని అద్భుతమైన శ్రీరామ మందిరంలో ప్రతిష్టించడానికి ఎంపిక చేశారని, ఇది రాష్ట్రంలోని మొత్తం రామ భక్తుల గర్వాన్ని, ఆనందాన్ని రెట్టింపు చేసిందని కర్నాటకకు చెందిన బీజేపీ నేత యెడియూరప్ప ట్వీట్ చేశారు.  ‘శిల్ప @yogiraj_arun’కు హృదయపూర్వక అభినందనలు” అని తెలిపారు. అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విగ్రహాలను జనవరి 22న ప్రధాని మోదీ సమక్షంలో అయోధ్య రామ మందిర గర్భాలయంలో ప్రతిష్టించనున్నారు.

క‌ర్నాట‌క‌లోని మైసూరుకు చెందిన ఈ శిల్పి చెక్కిన అయిదేళ్ల బాల‌రాముడి విగ్ర‌హాన్ని అయోధ్య‌లో ప్ర‌తిష్టించ‌నున్నారు. జ‌న‌వ‌రి 22వ తేదీన అయోధ్య‌లో ఆ విగ్ర‌హానికి ప్రాణ ప్ర‌తిష్ట చేయ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 12.20 నిమిషాల‌కు ఆ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తారు. కాగా, తాను చెక్కిన విగ్రహాన్ని అంగీకరించారా లేదా అనే దానిపై తనకు ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని అరుణ్ తెలిపారు. “ఆ విగ్రహం దేవుని అవతారపు ప్రతిమ కాబట్టి ఆ విగ్రహం కూడా ఒక పిల్లవాడిదిగా ఉండాలి. విగ్రహాన్ని చూసిన ప్రజలు దైవత్వాన్ని అనుభూతి చెందాలి” అని చెప్పారు. 

”చిన్నారిలాంటి ముఖంతో పాటు దైవత్వ కోణాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరేడు నెలల క్రితం నా పని ప్రారంభించాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఎంపిక కంటే ప్రజలు నా సృజనను మెచ్చుకోవాలి. అప్పుడే నేను సంతోషంగా ఉంటాను” అని శిల్పి అరుణ్ యోగి రాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న శిల్పుల్లో ఒకరైన అరుణ్ యోగిరాజ్ చిన్న వయసులోనే శిల్ప ప్రపంచంలోకి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అతని తండ్రి యోగిరాజ్ , తాత బసవన్న శిల్పి ప్రఖ్యాత శిల్పులు.

కృష్ణ‌శిల‌పై శిల్పి యోగిరాజ్ అయిదేళ్ల బాల‌రాముడి విగ్ర‌హాన్ని చెక్కారు. క‌ర్నాట‌క‌లోని కార‌క‌ల ప్రాంతం నుంచి ఆ కృష్ణ‌శిల‌ను అత‌ను తీసుకువ‌చ్చాడు. గ‌త ఏడాది మార్చిలో రామ్ ల‌ల్లా విగ్ర‌హం త‌యారీ కోసం ఈ రాయిని ఎంపిక చేశారు. త‌మ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంద‌ని అరుణ్ త‌ల్లి స‌రస్వ‌తి తెలిపారు. 
 
అరుణ్ శిల్పం చెక్క‌డాన్ని ప్ర‌త్య‌క్షంగా చూడాల‌నుకున్నా, కానీ చివ‌రి రోజు త‌న ప‌ని వ‌ద్ద‌కు తీసుకువెళ్తాన‌ని చెప్పాడ‌ని, శిల్పం ప్ర‌తిష్టించిన రోజు వెళ్ల‌నున్న‌ట్లు ఆమె తెలిపారు. అరుణ్ తండ్రి బ్ర‌తికి ఉంటే ఆయ‌న ఎంతో సంతోషించేవార‌ని ఆమె పేర్కొన్నారు. త‌న కుమారుడు చెక్కిన రాముడి శిల్పాన్ని ప్ర‌పంచం అంతా చూస్తుంద‌ని, ఇంత‌క‌న్నా త‌న‌కు సంతోషం ఏముంటుంద‌ని స‌రస్వతి తెలిపారు.
 
శిల్పి యోగిరాజ్ భార్య పేరు విజేత‌. త‌న భ‌ర్త ప‌ట్ల గ‌ర్వంగా ఉంద‌ని ఆమె తెలిపారు. త‌న‌కు మాట‌లు రావ‌డం లేద‌ని, సంతోషంగా ఫీల‌వుతున్నాన‌ని, గ‌ర్వంగా కూడా ఉంద‌ని ఆమె చెప్పారు. రామ్ ల‌ల్లాను చెక్కిన విష‌యాన్ని త‌న భ‌ర్త త‌న‌కు చెప్ప‌లేద‌ని, మీడియా ద్వారానే ఈ విష‌యాన్ని తెలుసుకున్న‌ట్లు ఆమె పేర్కొన్నారు. 
 
అస‌లు ఈ వార్త నిజమా అబ‌ద్దామా అన్న విష‌యాన్ని గ్ర‌హించ‌లేక‌పోతున్న‌ట్లు ఆమె తెలిపారు. ఫోన్ చేసి త‌న భ‌ర్త నుంచి విష‌యం తెలుసుకున్నాన‌ని ఆమె చెప్పారు. పని విష‌యంలో మాత్రం అరుణ్ ఎప్పుడూ రాజీ పడరాని, ఏ పని చేసినా వంద శాతం చేస్తార‌ని, పరిశోధన కావించి పూర్తిగా త‌న స‌మ‌యాన్ని కేటాయిస్తార‌ని ఆమె వివరించారు.
 
ఎంబీఏ చదివి కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్నప్పటికీ, శిల్పకళపై ఉన్న సహజమైన అభిరుచి అతన్ని 2008 లో తిరిగి శిల్ప ప్రపంచం లోకి తీసుకువచ్చింది. అప్పటి నుండి, అతని కళానైపుణ్యం వృద్ధి చెందింది, ఇది దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐకానిక్ శిల్పాలను సృష్టించడానికి దారితీసింది.

ఇండియా గేట్ సమీపంలోని అమర్ జవాన్ జ్యోతి వెనుక ప్రముఖంగా కనిపించే సుభాష్ చంద్రబోస్ 30 అడుగుల విగ్రహంతో సహా ఆకట్టుకునే ఎన్నో శిల్పాలు అరుణ్ రూపొందించారు. కేదార్ నాథ్ లో 12 అడుగుల ఎత్తైన ఆది శంకరాచార్య శిల్పం నుంచి మైసూరులో 21 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం వరకు శిల్పకళా ప్రపంచంలో అరుణ్ తనదైన ముద్ర వేసిన శిల్పాలు చాలా ఉన్నాయి.

రాముడి విగ్ర‌హం ఎంపిక కోసం ఓటింగ్ నిర్వ‌హించారు. డిసెంబ‌ర్ 30వ తేదీన ఆ ఓటింగ్ ప్ర‌క్రియ జ‌రిగింది. శ్రీ రామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్రకు చెందిన బోర్డు ట్ర‌స్టీలు రామ్ ల‌ల్లా విగ్ర‌హాల‌ను ప‌రిశీలించారు. పోటీలో ఉన్న మూడు విగ్ర‌హాల‌ను ప‌రిశీలించి త‌మ నిర్ణ‌యాన్ని లిఖిత పూర్వ‌కంగా ట్ర‌స్టుకు స‌మ‌ర్పించారు.  క‌ర్నాట‌క నుంచే మ‌రో శిల్పి గ‌ణేశ్ భ‌ట్‌, రాజ‌స్థాన్ నుంచి స‌త్య‌నారాయ‌ణ్ పాండేలు కూడా పోటీప‌డ్డారు. క‌ర్నాట‌క శిల్పులు కృష్ణ‌శిల‌ను వాడ‌గా, రాజ‌స్థాన్ శిల్పి మాత్రం మ‌క్రానా వైట్ మార్బుల్‌ను వాడారు. ముంబైకి చెందిన ఆర్టిస్టు వ‌సుదేవ్ కామ‌త్ ఇచ్చిన స్కెచ్‌ల ఆధారంగా రామ్ ల‌ల్లాను డిజైన్ చేశారు.