శ్రీరాముడి పేరుతో ఆన్‌లైన్ చందాల దందా !

ఒక వంక అయోధ్యలో శతాబ్దాల పోరాటాల అనంతరం రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంకు భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతూ ఉండగా, దేశ మంతటా పండుగ వాతావరణం నెలకొన్న సమయంలో ఇదే అదనుగా  కొందరు సైబర్ దొంగలు శ్రీ రాముడి పెరుగు ఛండాలంటూ జనాన్ని మోసం చేసి పనిలో పడుతున్నారు. 

అయితే భక్తుల విశ్వాసాలను సొమ్ము చేసుకొనేందుకు సైబర్‌ నేరగాళ్లు రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది. భక్తులకు ఫోన్లు చేసి, సోషల్‌ మీడియా సందేశాలు పంపుతూ.. అయోధ్య ఆలయానికి విరాళాలు ఇవ్వాలంటూ భక్తులను బురిటీ కొట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోన్‌, సందేశాల ద్వారా డబ్బులు పంపేందుకు వాట్సాప్‌ ఇతర సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా క్యూఆర్‌ కోడ్‌లు పంపిస్తున్నట్టు తెలుస్తున్నది.

దేశవిదేశాల్లోని శ్రీరామ భక్తులకు హిందూ సంస్థలు ఆన్‌లైన్ చందాల దందాలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాయి.  ఆలయానికి విరాళాలు దండిగా అందిస్తే వారికి రాముడి దయ ఉంటుందని తెలియచేస్తూ తమ వంతుగా విరాళాలు భారీగా పంపించాలని కోరుతూ, దీనికి తోడుగా క్యూర్ కోడ్ సందేశాలు కూడా వెలువరిస్తున్నారు. 

ప్రజలు ఈ కోడ్‌ను వాడుకుని చందాలు పంపిస్తే తాము స్వీకరించి రామాలయ ధర్మకర్తల మండలికి పంపిస్తామని సామాజిక మాధ్యమాలలో తెలియచేస్తున్నారు. ఈ విషయం విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) ఇతర సంస్థల దృష్టికి వచ్చింది.  దీనితో ఈ సంస్థల ప్రతినిధులు తక్షణం స్పందించారు. ఇటువంటి స్కాన్ పే మాయాజాలంలో పడొద్దని, వీటిపై స్పందించవద్దని హెచ్చరించారు. 

స్కాన్ చేసి చెల్లించి డబ్బు మోసగాళ్లకు చేరుతుందని తెలిపింది. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, యూపీ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు వీహెచ్‌పీ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ వెల్లడించారు. ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తోన్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. నిధుల సేకరణ బాధ్యతలను ఎవరికీ అప్పగించలేదని ఆయన స్పష్టం చేశారు. ఆలయం పేరు మీద డబ్బు వసూలు చేయడానికి నేరగాళ్ల ప్రయత్నాల గురించి ఇటీవల తమకు సమాచారం అందిందని ఆయన చెప్పారు.

‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర న్యాస్ నిధులను సేకరించడానికి ఎవరికీ అధికారం ఇవ్వలేదు. ప్రజలు ఇలాంటి మోసాలకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నేను హోం మంత్రిత్వ శాఖ, ఉత్తరప్రదేశ్ డీజీపీ, ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు లేఖ రాశాను.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని హెచ్చరించారు. ‘ఇది సంతోషకరమైన సందర్భం.. ఆలయ ప్రారంభోత్సవానికి మేము ఆహ్వానాలు పంపుతున్నాం… ఎటువంటి విరాళాన్ని అంగీకరించం’ అని స్పష్టం చేశారు.

ఇలాంటి సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హిందూ మత సంస్థలు సూచిస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖతో పాటు ఢిల్లీ, యూపీ పోలీసు శాఖల దృష్టికి తీసుకెళ్లామని వీహెచ్‌పీ తెలిపింది. ఆలయానికి విరాళాలు ఇవ్వాల్సిందిగా సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇటువంటి కాల్‌ను స్వీకరించిన వారిలో ఒకాయన వీహెచ్‌పీ కార్యకర్తలతో పంచుకున్నారు. ఓ కార్యకర్త ఆ నంబర్‌కు ఫోన్ చేయడంతో మోసగాళ్ల కుట్రలు బయటపడ్డాయి.

ఈ సమయంలో రికార్డ్ చేసిన ఫోన్ కాల్ ఆడియో క్లిప్‌ను వీహెచ్‌పీ షేర్ చేసింది. కాల్ చేసిన వ్యక్తి తాను రూ. 11,000 విరాళం ఇవ్వాలనుకుంటున్నానని, గ్రామంలోని ఇతరులు కూడా విరాళాలు ఇవ్వడానికి ఆసక్తిగా ఉన్నారని చెప్పినప్పుడు.. అవతలి వైపు ఉన్న మోసగాడు QR కోడ్‌ను పంపడానికి వాట్సాప్ నంబర్‌ను అడగటం వినిపిస్తుంది.

కాల్ చేసిన వ్యక్తిని ఒప్పించేందుకు దాతల పేర్లు, వివరాలను నమోదు చేస్తున్నామని, నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత వారిని రామమందిరానికి ఆహ్వానిస్తామని నమ్మబలికాడు. అంతేకాదు, ‘హిందూ, ముస్లిం సమాజాల మధ్య యుద్ధం జరిగిందని, ఆలయ నిర్మాణాన్ని కొనసాగించనివ్వడం లేదని చెప్పాడు. అందుకే గుడి కట్టేందుకు విరాళాలు సేకరిస్తున్నాం’ అని చెప్పడం గమనార్హం.