పాస్‌పోర్ట్‌ల జారీలో 5వ స్థానంలో సికింద్రాబాద్

పాస్ పోర్ట్ జారీలో దేశంలోనే సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం ఐదవ స్థానంలో నిలిచిందని ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారిణి (ఆర్ పీ ఓ) జొన్నలగడ్డ స్నేహజ ప్రకటించారు. దేశంలోని మొత్తం 37 పాస్ పోర్ట్ ప్రాంతీయ కార్యాలయాల్లో మొదటి నాలుగు స్థానంలో ముంబై, బెంగళూరు, లక్నో, చండీగఢ్ కార్యాలయాలు ఉన్నట్లు ఆమె తెలిపారు. 
 
2023లో పాస్ పోర్ట్ కార్యాలయం అందిస్తున్న సేవలు గురించి జొన్నలగడ్డ స్నేహజ మీడియా సమావేశంలో వివరిస్తూ పాస్ పోర్ట్ కోసం మధ్యవర్తులను సంప్రదించి మోసపోవద్దని ఆమె ప్రజలను హెచ్చరించారు. మధ్యవర్తులకు అవకాశం లేకుండా పాస్ పోరుల జారీ కోసం నూతన విధానాలను అమలు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.
 
ఈ ఏడాదిలో ఇప్పటివరకు 7,85,485 పాస్ట్ పోర్టు లు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు. గతంలో పోల్చితే ఈ ఏడాది 1,42,328 పాస్ పోర్టులు అత్యధికంగా జారీ చేశామని ఆమె తెలిపారు. 2023లో 260 పనిదినాలకు సరాసరిగా రోజుకు 3,021 కొత్త పాస్‌పోర్టులు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు. దళారుల వ్యవస్థను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటునట్లు ఆమె ప్రకటించారు.

పుట్టినతేదీ ధ్రువీకరణకు గతంలో ఆధార్‌ స్వీకరించామని, నిబంధనలు మారిన నేపథ్యంలో ఇప్పుడు ఆధార్‌ను అంగీకరించడం లేదని ఆమె వెల్లడించారు. పాన్‌, ఓటరు కార్డు, పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం.. వీటిలో ఏదైనా ఒకటి సమర్పించాలని స్నేహజ కోరారు.  పాస్ పోర్టులు తత్కాల్ విధానంలో జారీ చేసేందుకు కనీసం 4 నుంచి 5 రోజులు సమయం పడుతుంని ఆమె చెప్పారు. సాధారణ పాస్ పోర్ట్ లు జారీ చేయడానికి దాదాపు 22 రోజుల సమయం పడుతున్నట్టు ఆమె వివరించారు.