మేడిగడ్డ ఎవరు కట్టారో వారే బాధ్యత వహించాలి

మూడేళ్లలో మేడిగడ్డ ప్రాజెక్టు కుంగటం సిగ్గు చేటు అంటూ ఎవరు కట్టారో వారే బాధ్యత వహించాలని   నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే వివేక్, ఈ ఎన్ సి మురళీధర్ లతో కలిసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై మేడిగడ్డ వద్ద శుక్రవారం సమీక్ష జరిపారు.
 
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ అక్టోబర్ 21న మెడిగడ్డ పిల్లర్ కుంగిపోగాడిసెంబర్ 7వరకు కేసిఆర్ సీఎంగా ఉన్నారని గుర్తు చేశారు. కానీ కాళేశ్వరంపై ఒక్కసారి మాట్లాడలేదని,  ఇది చాలా సిగ్గుపడాల్సిన సంఘటన అని ధ్వజమెత్తారు. అన్ని విషయాలు నిర్దారణ చేస్తామని నిజానిజాలు అన్ని మీడియాకు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.
 
ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గతం నుంచి తాము చెబుతూ వచ్చిన విషయాలే నిజమయ్యాయని, త్వరలో ఇందులో అవకతవకలపై న్యాయ విచారణ చేపడతామని మంత్రులు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు వెల్లడించారు. గత ప్రభుత్వం రాజకీయ మతలబులతో ప్రాజెక్టుతో ఆదాయం ఎక్కువ చూపారని, కానీ రూపాయికి 52 పైసలు మాత్రమే ప్రయోజనం కలిగేలా ఉందని వారు ఆరోపించారు.

మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోవడంతో నీటిని నిల్వ చేయడానికి వీల్లేకుండా పోయింది. నదిలో ఉన్న నీటిని మొత్తం దిగువకు వదిలేయాల్సి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నారంలో సైతం నీటి బుగ్గలు రావడంపై మంత్రులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. నిర్మాణంలో లోపాలు, డిజైన్లలో లోపాలు ఉన్నాయా? అని పరిశీలిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. డిజైన్‌ లోపాలు, నిర్మాణ సంస్థ లోపాలు ఉన్నాయా అనేది కూడా నిగ్గు తేలుస్తామని చెప్పారు.

మరోవైపు ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోయిన ప్రాంతాన్ని మీడియాను అనుమతించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాన్ని ప్రజలకు తెలియ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని స్పష్టం చేశారు. నిర్మాణ లోపాలను ప్రజలకు వివరించాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు.  అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందని, ఆర్ధిక పరిస్థితి, విద్యుత్‌పై శ్వేతపత్రాలు విడుదల చేసినట్టే లక్ష కోట్ల సాగు నీటి ప్రాజెక్టుల వ్యవహారాన్ని కూడా ప్రజల ముందు ఉంచాలని చూస్తున్నామని చెప్పారు.

మేడిగడ్డ వైఫల్యానికి తమ బాధ్యత లేదనే ఎల్‌ అండ్‌ టి వాదన విషయంలో వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి చెప్పారు. ఆనకట్టల్లో నీటి నిల్వ భారం ఎక్కువ కావడం వల్ల దెబ్బతిన్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజలపై ఊహించనంత భారం పడబోతోందని మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ఇంజినీర్ల సలహాలు తీసుకున్నారా? ఆయనే చీఫ్ ఇంజినీర్‍‌గా చేశారా? అని మంత్రులు ప్రశ్నించారు