కుంగిన కాళేశ్వరంలో వ్యవసాయానికి దక్కింది అంతేనా..?

తెలంగాణకు గుదిబండగా మారిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అసలు లోపాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ప్రాజెక్ట్ డిజైన్ నుంచి ఇంజనీరింగ్ పనుల వరకు జరిగిన పొరపాట్లు వెల్లడవుతున్నాయి. గత ప్రభుత్వం దాచిన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభమై ఐదేళ్లు కావస్తున్నా.. ఇప్పటివరకు ఆ ఎత్తిపోతల పథకం నుంచి ఎత్తిపోసిన నీటిలో లెక్కలు కూడా గందరగోళంగా మారాయి. ఈ నేపథ్యంలో ఐదుగురు తెలంగాణ మంత్రుల కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శన ఆసక్తికరంగా మారింది.
కాళేశ్వరం కంటే ముందుగా ప్రతిపాదిత ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్ కు పేరు రావొద్దనే ఉద్దేశ్యం అప్పటి సీఎం కేసీఆర్ లో ఉందని మంత్రులు ఆరోపించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో పూర్తి వివరాలు వెల్లడైనట్లు మంత్రులు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ 1.25 మీటర్ల మేర కుంగిందని.. క్రాక్ వెడల్పు 150 ఎంఎం నుంచి 250 మధ్యలో ఉందని అధికారులు తెలిపారు.
ప్రైవేట్ ఏజెన్సీ సర్వే ప్రారంభమైందన్న అధికారులు.. 3 గేట్లు డ్యామేజ్ అయ్యాయని.. వాటి ప్లేస్ లో కొత్తగా ఏర్పాటు చేయాల్సి వస్తుందని వివరించారు. మొత్తం ప్రాజెక్ట్ కోసం 93,872 కోట్ల ఖర్చు చేయగా.. పాత ఆయకట్టుతో పాటు కొత్తగా 19.63 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా నిర్మించినట్లు తెలిపారు. 240 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు సీడబ్ల్యూసీ నుంచి అనుమతి వచ్చిందని.. నిర్వహణకు 8,450 మెగా వాట్స్ పవర్ అవసరం అవుతుందని సమగ్రంగా వివరించారు.
 ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పుకున్నా.. వాస్తవంలో ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తుగ్లక్ ప్రాజెక్ట్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులపై ఫైర్ అయ్యారు. మేడిగడ్డ కుంగడమే కాదు, అన్నారం బ్యారేజీ కూడా డ్యామేజీ అయ్యిందని.. దీనిపై తాము న్యాయ విచారణ జరుపుతామని మరోసారి స్పష్టం చేశారు.
అయితే దాదాపు లక్ష కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ద్వారా ఇప్పటివరకు కేవలం లక్ష ఎకరాలకు మాత్రమే సాగునీరు అందినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఐదేళ్లలో 1,053 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా.. ఒక్క టీఎంసీకి సరాసరి 10 వేల ఎకరాలకు సాగుకు తీసుకుంటారు. ఒక యూనిట్ కు రూ.6.40 ఉంటే.. రూ.3 అని చెప్పారు. ఈ లెక్కన కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఎకరాకు రూ.46 వేలు ఖర్చు అయితే.. సగం కూడా ఆదాయం లేదని తెలుస్తోంది. ఈ లెక్కన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ లో.. 90 శాతం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకే కేటాయించాల్సి వస్తుంది. దీంతో ప్రాజెక్ట్ అప్పు, నిర్వహణ ఖర్చులు ఖజానాకు తడిసిమోపెడవడం ఖాయం అని చెప్పొచ్చు.