వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు కొంతకాలంగా జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ కొట్టిపారేశారు. స్వరాష్ట్రం అయిన తమిళనాడులోని తూత్తుకుడి సీటు నుంచి తిరిగి పోటీ చేసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్లు, దీనికి బీజేపీ అధిష్టానం అంగీకరిస్తే తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవుల నుంచి తప్పుకునే అవకాశమున్నట్లు వస్తున్న ఊహాగానాలపై ఆమె శనివారం స్పందించారు.
అయోధ్య రామాలయ ద్వారాలకు తలుపులను తయారు చేసిన బోయిన్ పల్లిలోని అనురాధ టింబర్ డిపోను గవర్నర్ తమిళిసై సందర్శించారు. రామాలయ నిర్మాణంలో భాగస్వామ్యమైన అనురాధ టింబర్ డిపోకు రావడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందని, రాముడి ప్రతిమ చూసి మనసు పులకించిందని ఆమె పేర్కొన్నారు. ఇది అంత సులువైన పని కాదని.. ఎంతో కళాత్మకమైనదని, చాలా చక్కగా తీర్చిదిద్దారంటూ గవర్నర్ ప్రశంసించారు.
కాగా, తాను ఎంపీగా పోటీ చేస్తానని అదిష్ఠానానికి ఎటువంటి విజ్ఞప్తి చేయలేదని డా. తమిళిసై స్పష్టం చేశారు. తనకు అధిష్ఠానం ఎలాంటి బాధ్యత అప్పగిస్తే అది నెరవేరుస్తానని చెప్పుకొచ్చారు. తాను రాజీనామా చేశాననే మాటలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంటూ తుత్తుకుడిలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు మాత్రమే వెళ్లానని చెప్పుకొచ్చారు. తాను ఇక్కడే ఉంటానని.. ప్రజలతో ఉండడానికి ఇష్టపడతానని, ప్రజల కోసం పని చేయడానికే ఇష్టపడుతానని తెలిపారు.
‘‘నేను తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌గానే ఉంటున్నాను. ప్రధాని మోదీ, రాముడి దయతో విధులు నిర్వహిస్తున్నా. ఢిల్లీ వెళ్లలేదు, ఎవరినీ రిక్వెస్ట్ కూడా చేయలేదు. తమిళనాడు తూత్తుకుడి వరదల వల్ల ప్రభావం అయ్యినందున వెళ్లి చూసి వచ్చాను. మీరు అనుకొంటున్నట్లు నేనేమి ఎన్నికల్లో పోటీ చేయట్లేదు” అంటూ స్పష్టం చేశారు.
More Stories
అరుంధతి నగర్ లో ఇళ్ల కూల్చివేతపై ఈటెల ఆగ్రహం
భారతీయులందరూ సంస్కృత భాష నేర్చుకోవాలి
సికింద్రాబాద్ నుంచి మహా కుంభమేళాకు ప్రత్యేక రైలు