
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఒకటీ రెండు కరోనా కేసులు నమోదవుతూ యాక్టివ్ కేసుల సంఖ్య మొత్తంగా వందకు చేరువవైనట్టు సమాచారం. ఇప్పటివరకు హైదరాబాద్‌లోనే పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తుండగా ఇప్పుడు జిల్లాల్లో కూడా ఖాతా తెరిచేశాయి. తాజాగా వరంగల్ జిల్లాలో ముగ్గురు చిన్నారులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.
వరంగల్ ఎంజీఎంలో వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ ఆస్పత్రి (ఎంజిఎం)లోని పిల్లల విభాగంలో ముగ్గురు చిన్నారులకు కోవిడ్ సోకినట్లు ఆ స్పత్రి కార్యనిర్వహణ అధికారి డా.చంద్రశేఖర్ తెలిపారు. శనివారం పిల్లల విభాగంలో కొవిడ్ లక్షణాలతో గల ఐదుగురు చిన్నారుల టెస్ట్ నమూనాలను కాకతీయ మెడికల్ కాలేజీలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపగా 8 ఏళ్లలోపు ముగ్గురు చిన్నారులకు పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపారు.
ముగ్గురు పిల్లలను ప్రస్తుతం కరోనా పిల్లల విభాగంలోని ప్రత్యేక ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి ఎవరెవరిని కలిశారో వారికి కూడా కోవిడ్ టెస్ట్ నమూనాలను కెఎంసి వైరాలజీ ల్యాబ్‌కు పంపిస్తామని తెలిపారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో మొత్తం ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
దీంతో ఎంజీఎంలోని పిల్లల వార్డులో 20 పడకలతో ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేశారు. ఆయా చిన్నారులకు ప్రత్యేక వార్డులో చికిత్స అందజేస్తున్నారు.
ఇటీవల నీలోఫర్ ఆసుపత్రిలో ముగ్గురు చిన్నారులకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.
కరోనా కేసులు మెల్లగా వ్యాప్తి చెందుతుండటం, అందులోనూ చిన్నారులకు కూడా సోకుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల హైదరాబాద్‌లోని నిలోఫర్‌లో పసిపిల్లలకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు వైద్యులు సూచిస్తున్నారు. మాస్కు వాడటంతో పాటు తరచూ చేతులను శుభ్రపరుచుకోవాలని చెప్తున్నారు. అనారోగ్యానికి గురైతే నిర్లక్ష్యం చేయొద్దని వెంటనే వైద్యులను సంప్రదించాలని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చీకట్లు అలుముకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి విద్యుత్ సరఫరా ఒక్కసారిగా నిలిచిపోవడంతో రోగులు, వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో జనరేటర్ కూడా పనిచేయకపోవడంతో వారి కష్టాలు రెట్టింపు అయ్యాయి. దీంతో ఏం చేయాలో తెలీక ఆస్పత్రి సిబ్బంది పరుగులు తీశారు.
సుమారు గంట తర్వాత కరెంట్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేబుల్స్ కాలిపోవడంతోనే కరెంట్ సరఫరా నిలిచిపోయినట్లు ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
More Stories
పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేం
12 నుండి 15 వరకు మినీ మేడారం జాతర
ఎస్సి వర్గీకరణ రిజర్వేషన్ల వాటాల్లో మాదిగలకు అన్యాయం