`రెడ్ బుక్’పై లోకేష్ కు సిఐడి నోటీసులు

`రెడ్‌బుక్‌’ అంశంపై టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. రెడ్‌బుక్‌ పేరుతో నారా లోకేష్‌ బెదిరిస్తున్నారంటూ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు సూచనల మేరకు సీఐడీ లోకేష్‌కు వాట్సాప్‌లో నోటీసులు పంపింది. 

నోటీసులు అందుకున్నట్లు లోకేష్‌ వాట్సాప్‌లో సీఐడీకి సమాధానం ఇచ్చారు.లోకేష్‌కు నోటీసులు ఇవ్వడానికి గురువారం ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు. లోకేష్‌ నోటీసులను నేరుగా తీసుకోకపోవడంతో శుక్రవారం ఆయనకు వాట్సప్‌లో పంపించారు. కాగా, లోకేశ్‌ అరెస్ట్‌కు అనుమతి ఇవ్వాలన్న సీఐడీ పిటిషన్‌పై విచారణను ఏసీబీ కోర్టు జనవరి9వ తేదీకి వాయిదా వేసింది. 

టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి కేసుల్లో చంద్రబాబుకు రిమాండ్‌ విధింపును తప్పుబట్టడంతోపాటు కీలక సాక్షులుగా ఉన్న అధికారులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్‌కు నోటీసులు జారీచేయాలని విజయవాడ ఏసీబీ న్యాయస్థానం గురువారం ఆదేశించింది.  లోకేష్‌ను అరెస్ట్‌ చేసేందుకు అనుమతించాలన్న సీఐడీ పిటిషన్‌పై న్యాయస్థానం కీలక ఆదేశాలివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

గతంలో 41ఏ నోటీసు కింద సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా విధించిన ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం, ఈ కేసుల్లో కీలక సాక్షులుగా ఉన్న అధికారులు, న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల పేర్లను రెడ్‌బుక్‌లో రాశానని, వారి సంగతి తేలుస్తానని లోకేశ్‌ ఇటీవల పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూ లలో బెదిరించడం కలకలం రేపింది.