రామ్ గోపాల్ వర్మ  ‘వ్యూహం’ సినిమాకు చుక్కెదురు

2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ఏపీలో అధికార పక్షం వైసీపీకి మద్దతు ఇచ్చే విధంగా ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘వ్యూహం’ సినిమాకు వరుసగా ఆటంకాలు ఎదురవుతున్నాయి.  తాజాగా ఈ సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ ను జనవరి 11 వరకూ సస్పెండ్ చేస్తూ తెలంగాణా హైకోర్టు  మధ్యంతర ఉత్తర్వులు  జారీ చేసింది.
పిటిషన్ పై విచారణను కూడా జనవరి 11కు వాయిదా వేసింది. వ్యూహం సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ సూరేపల్లి నంద గురువారం విచారణ జరిపారు.  సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం రాత్రి 11.30 గంటల సమయంలో సినిమా ప్రదర్శనకు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ ను ఆయన సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
‘వ్యూహం సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడం అక్రమం. నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్‌ జారీ చేశారు. రాజకీయ లబ్ధి పొందడంతోపాటు ప్రతిపక్షాలకు నష్టం కలిగించే ఉద్దేశంతో సినిమా తీశారు. సెన్సార్‌ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్‌ను నిలిపివేయండి’ అంటూ లోకేశ్‌, టీడీపీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధర్‌ వాదనలు వినిపిస్తూ సీఎం జగన్‌కు రాజకీయ లబ్ధి చేకూర్చడంతోపాటు ప్రతిపక్షాలకు నష్టం కలిగించే దురుద్దేశంతో సినిమా తీశారని తెలిపారు.  నిర్మాణ సంస్థ రామధూత క్రియేషన్స్‌ అడ్రస్‌, సీఎం అడ్రస్‌ ఒకటేనని పేర్కొన్నారు. సినిమా తీసే ఆర్థిక స్థోమత నిర్మాత దాసరి కిరణ్‌కు లేదని, వైసీపీ నేతలే నిధులు సమకూర్చారని చెప్పారు. 
 
నిర్మాతకు టీటీడీ సభ్యుడిగా పదవి ఇచ్చారని గుర్తు చేశారు. ప్రీ రిలీజ్‌లో వైసీపీ మంత్రులు పాల్గొన్నారని పేర్కొన్నారు. సెన్సార్‌ బోర్డు తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ నర్సింహశర్మ వాదనలు వినిపిస్తూ తొలిసారి సర్టిఫికెట్‌ రిజెక్ట్‌ అయిన తర్వాత రివైజింగ్‌ కమిటీ అన్ని అంశాలను పరిశీలించి, దాదాపు పది మార్పులు చేసి సర్టిఫికెట్‌ ఇచ్చిందని వివరించారు. 
 
కోర్టు కేసులు, ఎన్టీఆర్‌ వంటి పదాలు, అనేక భాగాలను తొలగించారని పేర్కొన్నారు. నిర్మాత తరఫున సీనియర్‌ న్యాయవాది, వైసీపీ ఎంపీ ఎస్‌ నిరంజన్‌రెడ్డి వాదిస్తూ తండ్రికి పరువు నష్టం జరిగిందని పిటిషన్‌ వేసే అధికారం కుమారుడికి, పార్టీకి లేదని తెలిపారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం తీర్పు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
మహిళా కమిషన్‌కు బర్రెలక్క ఫిర్యాదు
మరోవంక, రాంగోపాల్‌ వర్మపై బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీష మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా ‘ఊరు.. పేరు లేని ఆవిడ.. బర్రెలక్కగా చాలా ఫేమస్‌ అయిపోయింది’.. అని అవమానించారని శిరీష తరఫు న్యాయవాది ఆగ్రహం వ్యక్తం చేశారు.  తమ ప్రాంత బిడ్డలను కించపరిచేలా మాట్లాడటం తప్పు అని, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తరిమి కొడతామని హెచ్చరించారు.
ఆర్జీవీ బతకాలి అనుకుంటే బ్లూ ఫిలిమ్స్ తీసుకుని బతుకాలని.. అంతే కానీ తమ ప్రాంత బిడ్డలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని హితవు చెప్పారు. ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.  తెలంగాణలో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమెకు భారీగానే మద్దతు దక్కింది. నిరుద్యోగులతో పాటూ ఎన్నికల సమయంలో ఆమెకు ఎన్నారైలు, మాజీ ఐపీఎస్‌లు, పలువురు లాయర్లు, సినీ నటులు మద్దతు పలికారు. 
 
కొందరు ప్రముఖులు ఆమె తరఫున ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఎన్నికల్లో ఆమెకు 5,754 ఓట్లు దక్కాయి. అయితే బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా జనసేన పార్టీకి తెలంగాణలో రాలేదంటూ స్వయంగా ఏపీ సీఎం జగన్‌తో పాటూ దర్శకుడు ఆర్జీవీ కూడా కామెంట్స్ చేశారు. అయితే వర్మ చేసిన కామెంట్స్‌ మాత్రం అవమానించేలా ఉన్నాయని బర్రెలక్క ఆరోపిస్తున్నారు.