అంగన్వాడీల ఆవేదనను పట్టించుకోని ఏపీ సర్కారు

రాష్ట్రంలో ఉన్న దాదాపు లక్ష మంది అంగన్వాడీ అక్కాచెల్లెమ్మలను ఆదుకుంటానని.. తెలంగాణలో ఇచ్చే జీతం కంటే అధికంగా ఇస్తానంటూ.. 2018లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ హామీ ఇచ్చారు. ఆ ప్రకటన.. అంగన్వాడీల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. ఎందుకంటే అప్పటికి వారి జీతం నెలకు రూ.10,500 మాత్రమే. అది కూడా ఎన్నో పోరాటాలు, ఆందోళనలు చేయగా.. ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం.. వారి జీతాన్ని ఆ మొత్తానికి పెంచారు.
అయితే జగన్ సర్కారు ఏర్పడ్డాక అంగన్వాడీలకు చేసింది కేవలం వెయ్యి రూపాయలు జీతం పెంచడం మాత్రమే. 2019 జూన్‌లో జీవో నెం.13 ద్వారా రూ.11,500 లకు పెంచారు. హెల్పర్లు, మినీవర్కర్ల జీతం రూ.7000 చేశారు. అయితే అప్పటి నుంచి వారిని పట్టించుకున్న దాఖలాలు లేవు. అన్నింటికన్నా అంగన్వాడీలకు ప్రభుత్వం తరపున ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కావడం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన వితంతు, వికలాంగ పెన్షన్ ను కూడా జగన్ ప్రభుత్వం వచ్చాక నిలిపివేసింది.
ప్రభుత్వానికి, అంగన్‌వాడీలకు మధ్య యజమాని-కార్మిక సంబంధం ఉందని సుప్రీంకోర్టు గతంలో తీర్పు వెల్లడించింది. అందుకు అనుగుణంగా సమానపనికి సమానవేతనం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ విధంగా చూస్తే.. అంగన్‌వాడీల జీతం కనీస స్థాయిలో వేతనం రూ.26 వేలు దాటాలి. అలాగే పి.ఎఫ్‌, ఇఎస్‌ఐ, పెన్షన్‌ తదితర సౌకర్యాలు కూడా అందజేయాలి.
సుప్రీం తీర్పు ప్రకారం గ్రాట్యుటీ కూడా అందించాలి. కానీ అంగన్‌వాడీలకు ఇందులో ఏ ఒక్కటీ అమలు కావడం లేదు. రాష్ట్రంలో 55 వేల 605 మినీ సెంటర్లు ఉండగా.. అక్కడి జనాభా ప్రకారం వాటిని మెయిన్ సెంటర్లుగా మార్చాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. దాన్ని పట్టించుకోలేదు. ఇక ప్రమోషన్లు, వేసవి సెలవులు అసలే లేవు.ఇక ఈ నాలుగున్నరేళ్లలో పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాల పెంపుదల లేదు. ఇక తెలంగాణలో మాదిరిగా కాకున్నా.. కనీస వేతనాన్ని అమలు చేయాలనే డిమాండ్ ఉంది.
గ్రేడ్-2 సూపర్ వైజర్ పోస్టులు పూర్తిగా భర్తీ కాకపోవడంతో పాటు.. గత నాలుగున్నరేళ్ల కాలంలో వందలాదిగా అంగన్వాడీలు సర్వీసులో ఉండి మరణించినా.. కనీసం బీమా కూడా అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇలా గ్రాట్యుటీ అమలు చేయాలని, వేతనాలు పెంచాలని, మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని కోరారు. అలాగే సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతోపాటు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా, పెండింగ్‌లో ఉన్న 164 గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పోస్టులు వేతనంతో కూడిన మెడికల్‌ లీవులు, లబ్ధిదారులకు మెనూ ఛార్జీలు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తూ.. డిసెంబర్ 8 నుంచి ఆందోళనకు దిగారు.