ఖతార్‌లో 8 మంది భారతీయులకు మరణశిక్ష నుంచి ఉపశమనం

గూఢచర్యం కేసులో ఖతార్‌లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ అధికారులకు గురువారం పెద్ద ఊరట లభించింది. భారత ప్రభుత్వం అప్పీల్‌పై వారి మరణశిక్షపై స్టే విధిస్తూ ఖతార్ కోర్టు కీలక తీర్పు ఇచ్చిందని భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తెలిపింది. వారి మరణశిక్షను జైలు శిక్షగా తగ్గించినట్టు పేర్కొంది. 
 
వివరణాత్మక తీర్పు కోసం వేచి ఉన్నామని, తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునేందుకు తాము న్యాయ బృందంతో పాటు కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉన్నామని ఎంఈఏ తెలిపింది. విచారణ సందర్భంగా రాయబారులు, ఇతర అధికారులు కోర్టుకు హాజరైనట్టు ఒక ప్రకటనలో చెప్పింది. భారతీయ మాజీ నేవీ అధికారులకు రాయబార సంప్రదింపులతోపాటు చట్టపరమైన సహాయాన్ని కొనసాగిస్తామని వెల్లడించింది.

ఆ 8 మంది భారతీయుల మరణశిక్షను జైలు శిక్షగా తగ్గించడం మంచి పరిణామమే గానీ ఎన్నాళ్లపాటు ఆ శిక్షను విధించారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ తీర్పుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, ఈ అంశంపై ఖతార్ అధికారులతో తాము చర్చిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

 తాము మొదటి నుండి 8 మంది కుటుంబాలకు అండగా ఉన్నామని, అయితే ఇది సున్నితమైన విషయం కాబట్టి దీని గురించి ఎక్కువగా మాట్లాడటం సరికాదని అధికారులు తెలిపారు. ఖతార్ ప్రభుత్వం ముందు ఈ విషయం గురించి నిరంతరం లేవనెత్తుతూనే ఉన్నామని, దాన్ని కొనసాగిస్తూనే ఉంటామని విదేశాంగ శాఖ పేర్కొంది. 

అటు.. ఆ 8 మంది భారతీయుల శిక్షను తగ్గించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ 8 మంది నౌకాదళ మాజీ అధికారులు అల్‌ దహ్రా అనే సంస్థలో పని చేసేవారు. ఈ సంస్థ.. ఖతార్‌ సాయుధ దళాలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఇతర సేవలు అందిస్తుంది. దీనిని ఒమన్‌కు చెందిన ఓ మాజీ వైమానిక దళ అధికారి నిర్వహిస్తున్నారు. 

 ఈ తీర్పుపై భారత విదేశాంగ శాఖ దోహాలో అప్పీలు దాఖలు చేయగా దాన్ని పరిగణనలోకి తీసుకుని, వారి మరణశిక్షను జైలు శిక్షగా తగ్గించారు. కాగా, ఖతార్‌లోని ప్రైవేట్‌ సంస్థలో పనిచేసిన భారతీయ నేవీ మాజీ కమాండర్లు పూర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, అమిత్ నాగ్‌పాల్, సంజీవ్ గుప్తా, మాజీ నేవీ కెప్టెన్లు నవతేజ్ సింగ్ గిల్, బీరేంద్ర కుమార్ వర్మ, సౌరభ్ వశిష్ట్, మాజీ సెయిలర్ రాగేశ్ గోపకుమార్‌ను 2022లో అరెస్ట్‌ చేశారు. 

ఇజ్రాయెల్‌ తరుఫున గూఢచర్యం చేస్తున్నట్లు అభియోగాలు మోపడంతో  ఈ కేసులో విచారణ జరిపిన అక్కడి న్యాయస్థానం ఈ ఏడాది అక్టోబర్‌లో వారికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. మరోవైపు భారత ప్రభుత్వం దీనిపై స్పందించింది. ఖతార్‌ ప్రభుత్వ యంత్రాంగంతో సంప్రదింపులు జరిపింది. 

భారతీయ మాజీ నేవీ అధికారులకు దౌత్య సంప్రదింపులతోపాటు చట్టపరమైన సహాయాన్ని అందించింది.అలాగే ఇటీవల దుబాయ్‌లో జరిగిన కాప్‌28 శిఖరాగ్ర సమావేశంలో ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీని ప్రధాని మోదీ కలిశారు. ఈ అంశంపై మాట్లాడారు. ఈ నేపథ్యంలో భారత మాజీ నేవీ అధికారులకు విధించిన మరణ శిక్ష అపీల్‌పై ఖతార్‌ కోర్టు విచారణ జరిపింది. మరణ శిక్షను తగ్గించి జైలు శిక్షగా మార్పు చేసింది.