గాజాపై ఇజ్రాయెల్‌ దాడిలో భారతీయుడు మృతి

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం  కొనసాగుతూనే ఉంది. హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో గాజాలోని రఫా నగరంపై జరిగిన దాడిలో ఐక్యరాజ్యసమితిలో పనిచేసే ఓ భారతీయుడు మృతిచెందారు.

యునైటెడ్‌ నేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ (డిఎస్ఎస్) విభాగంలో పనిచేస్తున్న ఆ వ్యక్తి తన వాహనంలో రఫాలోని యూరోపియన్‌ దవాఖానకు వెళ్తుండగా దాడి జరిగింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తున్నది. ఆయతో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వ్యక్తి భారత్‌కు చెందిన మాజీ సైనికుడని తెలుస్తున్నది.

కాగా, ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెర్రెస్‌ స్పందించారు. “ఐరాసకు చెందిన డీఎస్‌ఎస్‌ విభాగంలోని సభ్యుడు మరణించడం చాలా బాధాకం. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రషాలోని యూరోపియన్‌ దవాఖానకు వెళ్లుండగా ఈ ఘటన చోటుచేసుకున్నది” అని తెలిపారు.  గాజాలో ఇప్పటివరకు ఐరాసకు చెందిన 190 మందికిపైగా సిబ్బంది మరణించారు.

మానవతావాదంతో సహాయం చేసే కార్యకర్తలకు తప్పనిసరిగా రక్షణ కల్పించాలని స్పష్టం చేశారు. యూఎన్‌ సిబ్బందిపై జరిగిన అన్ని దాడులను ఖండిస్తున్నట్లు చెప్పారు. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని, బందీలందరినీ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. గాజాలోని ఉత్తర, దక్షిణ, సెంట్రల్‌ ప్రాంతాల్లో రాత్రిపగలు అనే తేడా లేకుండా ఇజ్రాయిల్‌ బలగాలు వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. ఉత్తర గాజాలోని జాబాలియా శరణార్ధుల శిబిరం వున్న ప్రాంతంలోకి, రఫా నగరంలోకి ఇజ్రాయిల్‌ బలగాలు, ట్యాంకులు చొచ్చుకుపోయాయి.

అక్కడ రాత్రంతా ఉధృతంగా వైమానిక దాడులు కొనసాగిన తర్వాత సోమవారం ఉదయం నుండీ మిలటరీ దాడులు మొదలయ్యాయి. గడచిన 24 గంటల్లో 57మంది మరణించగా, 82మంది గాయపడ్డారు. ఇప్పటివరకు దాదాపు 3,60,000మంది పాలస్తీనియన్లు రఫా నగరాన్ని వీడి వెళ్లిపోయారని ఐక్యరాజ్య సమితి వర్గాలు పేర్కొన్నాయి. రఫా నుండి ఖాన్‌ యూనిస్‌ నగరానికి ప్రజలు బారులు తీరి వెళ్లడం కనిపిస్తోంది.

మరోవంక, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ అణు హెచ్చరిక జారీ చేసింది. తమ దేశ ఉనికికి ప్రమాదం వాటిల్లితే తమ అణు విధానాన్ని మార్చుకుంటామని పేర్కొన్నది. ఈ మేరకు ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా ఖమేనీ సలహాదారు కమల్‌ ఖర్రజి కీలక వ్యాఖ్యలు చేశారు.